అన్ని పార్టీలతో సహా జనసేనాని పవన్ కూడా తన అభ్యర్ధుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకాలం నాదెండ్ల మనోహర్ సూచనలకు ఇప్పుడు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా తోడయ్యాడు. జేడీ విశాఖపట్టణం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. అయితే పవన్ మాత్రం ఆయన సొంత జిల్లా కర్నూల్‌కి వెళ్లమని భావిస్తున్నాడట. అయితే ఈ విషయంలో లక్ష్మీనారాయణ మాటకు పవన్ విలువనిచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల తాను తొందరపడి అభ్యర్ధులుగా ప్రకటించిన వారి వ్యవహారశైలి కూడా పవన్‌కి గుణపాఠంగా మారిందని అంటున్నారు.
జనసేన విశాఖ ఎంపీగా ఆయన గేదెల శ్రీనుబాబుని నిలబెట్టాడు. కానీ ఆయన హఠాత్తుగా వైసీపీ కండువా కప్పుకుని జగన్ సరసన చేరిపోయాడు. ఇక మరో సీనియర్ రాజకీయ విశ్లేషకులు.. పోలవరం ఉద్యమనేత పెంటపాటి పుల్లారావుకి సైతం జనసేనలో చేరాడు. ఈయనకు పవన్ ఎంతో గౌరవంగా ఏలూరు ఎంపీగా సీటు ఇచ్చాడు. కానీ ఆయన కూడా తాజాగా వైసీపీ కండువా కప్పుకోవడంతో అసలైన రాజకీయాలు ఇలా ఉంటాయా? అని పవన్‌కి అనిపించినా ఆశ్చర్యం లేదు. అయితే ఈ పరిణామాలకు జనసేనానికి ఓ గుణపాఠంగా ఉపయోగపడతాయనేది మాత్రం అక్షర సత్యం.
కానీ అదే సమయంలో పవన్ తెలిసి తెలిసి మరో తప్పు చేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. ఆయారాం గయారాం వంటి గంటాశ్రీనివాసరావు సమీప బంధువు, ప్రముఖ వ్యాపారవేత్త పరుచూరి భాస్కర్‌రావుని జనసేనలో చేర్చుకోవడం ద్వారా పవన్ మరో తప్పు చేస్తున్నాడని ఆయన శ్రేయోభిలాషుల అభిప్రాయం. గంటాకి ఏ పార్టీలో ఉన్న కూడా ఇతర పార్టీలలోని కీలక విషయాలను తెలుసుకునేందుకు అన్ని పార్టీలలో కోవర్టులని నియమిస్తాడనే చెడ్డ పేరు ఉంది. మరి ఆయన సమీప బంధువు పరుచూరి భాస్కర్‌రావు కూడా ఇదే కోవలోకి వచ్చే వ్యక్తేనని స్వయంగా జనసైనికులే అనుమానపడుతున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో పవన్ మరింత పరిణితి, పరిపక్వతతో ముందుకు వెళ్తాడనేది మాత్రం వాస్తవం.