తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్రను పోషించాడు. ఆయన కన్నుసన్నలలోనే మహాకూటమి ఏర్పడింది. రాహుల్‌గాంధీ కూడా చంద్రబాబు సలహాలు తీసుకున్నాడు. దీంతో టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తనని ఓడించేందుకు ప్రయత్నించిన చంద్రబాబుని, టిడిపిని ఏపీలో అధికారంలోకి రానివ్వనని, ఆయనకు రిటర్న్‌గిఫ్ట్‌లు ఇస్తానని చెప్పాడు. అనుకున్నట్లే ఒకవైపు మజ్లిస్‌ని, బిజెపిని కలగలిపి వైసీపీ అధినేత జగన్‌కి కూడా సాయం చేస్తున్నాడు. దీనిపై ప్రస్తుతం ఏపీ అంతటా విపరీతమైన చర్చ సాగుతోంది. దీనిని చంద్రబాబు కూడా ఓ ఆయుధంగా మార్చుకున్నాడు. ఏపీలో జగన్ వస్తే కేసీఆర్ కింద సామంత ముఖ్యమంత్రిగా జగన్ ఉంటాడని, కేసీఆర్ చెప్పినట్లే నడుచుకుంటాడని విమర్శలు ఎక్కుపెడుతున్నాడు.
ఈ విషయంలో పవన్ మరో కీలక అడుగు వేశాడు. కేసీఆర్ గారూ.. మీరు పెద్దగా రక్తపాతం లేకుండానే తెలంగాణ సాధించారు. ఏపీ ప్రజలను ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు మీరు కోరుకున్న ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఇకపై మాత్రం ఏపీ జోలికి రావద్దని విన్నపం చేశాడు. ఇంతకీ కేసీఆర్ అంటున్న రిటర్న్ గిఫ్ట్‌లు ఏమిటో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంతకాలం హైదరాబాద్ రాజధాని కావడంతో పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు తమ సంస్థల కార్యకలాపాలను హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ రాజకీయాలంటే టిడిపి, వైసీపీ రెండింటిలో ఫుల్‌టైమ్ పొలిటీషియన్స్ తక్కువ. అందరు వ్యాపారవేత్తలే. దీనినే కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వ్యాపారం చేసే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాడు. హైదరాబాద్‌లో టిడిపికి చెందిన వ్యాపారవేత్తలను ఐటి, ఇతరత్రా విషయాలలో ఆయన కక్ష్యసాధింపు ధోరణి చూపించే ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే హైదరాబాద్‌లో భారీ అస్తులు ఉన్న మురళీమోహన్ కూడా ఈ సారి ఎన్నికల్లో నిలబడటం లేదని తెలుస్తోంది.
తాజాగా నెల్లూరు జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గం నుంచి బడా పారిశ్రామికవేత్త ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు. కానీ ఆయనపై ఏ ఒత్తిడి వచ్చిందో ఏమో గానీ ఆయన హఠాత్తుగా ఎవ్వరికీ చెప్పకుండా వైసీపీలోకి వెళ్లాడు. వెళ్లే ముందు చంద్రబాబు చేత తాను చేసిన కాంట్రాక్ట్‌లకి సంబంధించి 50కోట్ల బిల్లుల వరకు మంజూరు చేయించుకుని, సొమ్ము బ్యాంక్ ఖాతాలో పడిన తర్వాతే ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్లి వైసీపీలో చేరాడు. ఇలాంటి రాజకీయ నాయకులు చాలామంది తమ వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌కి శత్రువులుగా మారకుండా ఉండేందుకు చంద్రబాబు సీటు ఇస్తానన్నా వద్దని చెబుతున్నారట. ఈ విధంగా కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్‌లు చంద్రబాబుపై భారీగానే ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది.