వర్మ ముందు పుట్టి ఆ తర్వాతే వివాదం పుట్టిందేమో అని ఎవరికైనా అనిపించకమానదు. కానీ వర్మ వంటి మనస్తత్వం ఉన్నవారు ఎంతకైనా తెగిస్తారు. ఒక విమర్శ చేస్తే వారిపై వంద విమర్శలు చేస్తారు. కొందరిని మనసులోనే పెట్టుకుని జీవితాంతం టార్గెట్ చేస్తూనే ఉంటారు. అతి పెద్ద మొండివాడు రాజు కంటే బలవంతుడు అనేది అందుకే. ఇదే సందర్భంలో త్రివిక్రమ్ తాను దర్శకునిగా తీసిన మొదటి చిత్రంలో తరుణ్ చేత ప్రకాష్‌రాజ్‌పై ఓ డైలాగ్ విసురుతాడు. తాజ్‌మహల్ వంటి వాటిని చూడాలని అనుకోవచ్చే గానీ సొంతం చేసుకోవాలంటే వీలు కాదు.. నేను కూడా అదే టైప్ అంటాడు. ఇది వర్మకి బాగా వర్తిస్తుంది. ఆయనను డబ్బుతో, బెదిరింపులతో లొంగతీసుకోవడం కాని పని. అదే వేరే ఎంత పెద్ద దర్శకుడైనా సరే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి చిత్రాన్ని అటెంమ్ట్ చేయలేరు. చేసినా వర్మలా తెగువతో విడుదలకు ఆటంకాలు, బెదిరింపులు వస్తాయని, ఇండస్ట్రీలోని, రాజకీయాలలోని పెద్ద మనుషులతో అనవసరమైన గొడవ ఎందుకని మౌనంగా ఉండి పోయేవారు.
కానీ వర్మ మాత్రం తాను తీస్తున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని తన ప్రాణం పోయినా విడుదల చేస్తానని, విడుదల చేయడం కుదరకపోతే యూట్యూబ్‌లో అయినా పెట్టేస్తానని చెబుతున్నాడు. ఈ చిత్రం విడుదలకు ఇంకా వారం కూడా వ్యవధిలేదు. సెన్సార్ అప్‌డేట్స్ లేవు. ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు టీడీపీ పార్టీ ఎన్నికల కమిషన్‌ని ఆశ్రయించినప్పటికీ సినిమాల విడుదల విషయం తమ పరిధిలోది కాదని, రిలీజ్‌ని అడ్డుకోలేమని తేల్చిచెప్పింది. ఇక మిగిలిన ఒకే మార్గం న్యాయస్థానానికి వెళ్లడమే. ఇలాంటి సందర్భంగా ఈ చిత్రం నిర్మాత అయిన రాకేష్‌రెడ్డి తాజాగా ఓ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టాడు.
ఓ వెబ్‌చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తీయకుండా ఆపేస్తే 50కోట్లు వర్మకి ఇస్తామని కొందరు రాయబారం నడిపారు. కానీ ఆయన అలా అమ్ముడుపోయే వ్యక్తి కాదని నాకు తెలుసు. వర్మ అప్పుల్లో ఉన్నాడని, ఆ డబ్బుని తీసుకుంటాడని పలువురు భావించారు. కానీ అంత ఖర్మ వర్మకి పట్టలేదు. ఇక ఈ చిత్రం 22న విడుదల కానుందా? లేదా? అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆన్‌లైన్‌లో పెట్టాల్సిన అడ్వాన్స్ బుకింగ్స్ జాడ లేదు. అసలు థియేటర్లు బుక్ చేసుకున్నారో లేదో తెలీదు. ప్రస్తుతం పెద్ద చిత్రాలేమీ లేవు కాబట్టి ఒకటికి పది థియేటర్లు దొరికే చాన్స్ ఉంది. అయినా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. మరి చివరకు ఏమవుతుందో అనే ఉత్కంఠ మాత్రం అందరిలో కనిపిస్తోంది.