అష్టాచెమ్మా చిత్రంలో నాని ని నటుడిగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆ తర్వాత నానితో జెంటిల్మాన్ తీసి సూపర్ హిట్ సాధించాడు. మళ్ళీ వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో మరో డిఫరెంట్ చిత్రం రాబోతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్… హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకీ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. గతంలో కూడా బిజినెస్ మెన్ చిత్రంలో మహేష్ బాబు, బిల్లా చిత్రంలో ప్రభాస్, టెంపర్, జై లవకుశ వంటి చిత్రాల్లో ఎన్టీఆర్… నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులని సర్ప్రైజ్ చేసారు. ఇక నేచురల్ స్టార్ నాని గతంలో జెంటిల్మెన్ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాసేపు కనిపించాడు.
అయితే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో కనిపించడానికి నాని రెడీ అవుతున్నాడట. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో నాని ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని కాసేపు నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో కనిపిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కాసేపు కాదు… సినిమా మొత్తం నాని విలన్ గానే కనిపిస్తాడట. ఈ చిత్రంలో నానిదే కీలకపాత్రట. ఇక ఇదే సినిమాలో సుధీర్ బాబు హీరోగా కనిపిస్తాడని… తనది పోలీస్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. నాని విలన్ అయినా కూడా తనకి హీరోయిన్ ఉంటుందట. ఈ పాత్రకోసం సమ్మోహనం ఫేమ్ అదితి రావు హైదరీ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలో విలన్ పాత్రయినప్పటికీ హీరోయిజం ఏమాత్రం తగ్గకుండా చూపిస్తాడట ఇంద్రగంటి. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తోంది..!!