నిన్న మొన్నటి వరకు తెలుగులో దేశభక్తి చిత్రాలు రావడం లేదనే కొరత ఉండేది. బాలీవుడ్‌లో ఇలాంటి చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటాయి. ‘లగాన్’ నుంచి దీనికి ఉదాహరణగా ఎన్నిటినో చెప్పవచ్చు. కానీ తెలుగులో మాత్రం నాటి ‘అల్లూరి సీతారామరాజు’ నుంచి ‘మేజర్‌చంద్రకాంత్’ వంటివి తప్ప చెప్పుకోదగిన దేశభక్తి కాన్సెప్ట్ చిత్రాలు లేవు. నిజానికి దేశభక్తి అనేది యూనివర్శల్ పాయింట్. మరోవైపు సమైక్యాంధ్ర రెండుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రాలుగా వేరుపడ్డారు. ఇలాంటి సమయంలో దేశభక్తిని పీక్స్‌లో చూపిస్తూనే ఇటు ఆంధ్రాకి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణ యోధుడు కొమరం భీంల స్ఫూర్తితో రాజమౌళి చిత్రం చేయడం విశేషమనే చెప్పాలి.
నిజానికి దేశస్వాతంత్య్ర వీరులకు, దేశభక్తినిండిన పోరాట యోధులకు ప్రాంతాలు, కులాలు, మతాలు అడ్డురావు. ఇలా రాజమౌళి ‘బాహుబలి’ వంటి ఫిక్షన్ తర్వాత ప్యాన్ ఇండియా చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్’ని తీస్తూ ఉండటం ఒకవిధంగా అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న దానయ్యను కూడా మెచ్చుకోవాలి. ఏకంగా తనకి ఈ ప్రాజెక్ట్‌ని ఇస్తే100కోట్లు ఇస్తానని ఓ నిర్మాత హామీ ఇచ్చినా సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న దానయ్య ఆ చాన్స్‌ని కూడా కాదనుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్‌లు నటిస్తున్న అసలు సిసలు మల్టీస్టారర్, అందునా దేశభక్తి కాన్సెప్ట్ చిత్రం కావడం వల్ల ఎన్ని కోట్లు ఇచ్చినా తనకి మరలా మరలా ఇలాంటి అవకాశం రాదని భావించిన ఆయన వందకోట్ల కోసం ఆధారపడకుండా తానే ఈ చిత్రాన్నినిర్మిస్తుండటం, మరోవైపు నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌లు ఇద్దరు ఈ చిత్రంలో నటించడానికి ముందకు రావడం అనేవి హర్షణీయ పరిణామాలేనని చెప్పాలి. ఏది ఏమైనా బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి బెస్ట్ ఆప్షన్‌నే ఎంచుకున్నాడనేది నిర్వివాదాంశం.