సూపర్ స్టార్ మహేష్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం మహర్షి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. అందరి అంచనాలకు దీటుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహర్షి విడుదల మూడు సార్లు వాయిదా పడి ఫైనల్ గా మే 9 న విడుదల డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23 కౌంటింగ్ డేట్స్ ఇచ్చేశారు. వీటి ప్రభావం తమ హీరో సినిమా మీద పడుతుందేమో అన్న అనుమానం ఫాన్స్ లో లేకపోలేదు. కానీ మహర్షి వచ్చే టైంకి ఎలక్షన్ రిజల్ట్స్ కి మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది.
మహేష్ లాంటి స్టార్ ఓపెనర్ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రెండు వారాల్లో పెట్టుబడి మొత్తం ఇచ్చేస్తారు. అధికారంలోకి ఎవరు వస్తారు అనే ఉత్కంఠ జనాల్లో ఉన్నప్పటికీ సినిమాలను త్యాగం చేసి మరీ రెండు వారాలు ఎదురు చూసేంత సీన్ ఉండదు. కానీ ఆ టైంలో ప్రమోషన్ చాలా కీలకంగా మారుతుంది. అంతా సానుకూలంగా కనిపించినా మరొక చిక్కు ఉంది. రాజకీయ పార్టీలు వాటి అనుచరగణం తదితరాలు సినిమాలు చూసే మూడ్ లో ఉండకపోవచ్చు. అది కొంత మేర ప్రభావం చూపిస్తుంది. అయితే పబ్లిసిటీకి మహర్షికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తాపీగా ఏప్రిల్ మూడో వారం నుంచి చేసుకోవచ్చు. అప్పటికే ఎన్నికలు పూర్తైపోయి ఉంటాయి కాబట్టి సాఫీగా ఉంటుంది. ప్రస్తుతం బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మహర్షికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి ఎన్నికల వేడి ఎలా ఉంటుందో.వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు, పివిపి, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.