నటులుగా ఫేడ్ అయిన తర్వాత మనవారు చేసే పని రాజకీయాలపై దృష్టి సారించడం. అయితే మన నటీనటులు గతంలో ఫేడవుట్ అయిన తర్వాత దర్శకనిర్మాతలుగా కూడా అవతారం ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు దర్శకనిర్మాతలుగా కూడా మెప్పించారు.
ఇక విషయానికి వస్తే తెలుగులో దర్శకులు కావాలని భావించి అనూహ్యంగా నటులుగా స్థిరపడిన వారు కొందరు ఉన్నారు. వారిలో రవితేజ, నాని, రాజ్‌తరుణ్, సునీల్ వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు. మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన దర్శకత్వంపై దృష్టి సారించాడని సమాచారం. జూనియర్ ఆర్టిస్టు తరహాలో కొన్ని పాత్రలు చేసి, తర్వాత ‘సింధూరం, ఖడ్గం, నీకోసం’ వంటి చిత్రాల ద్వారా హీరోగా మారిన రవితేజ మరి తనకు హీరోగా సరైన సక్సెస్‌లు, అవకాశాలు రావడం లేదని భావించాడా? లేక మరేదైనా కారణం ఉందేమో తెలియదు గానీ ప్రస్తుతం మెగాఫోన్ చేతపట్టేందుకు రెడీగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో చాలా మంది హీరోలు దర్శకత్వం వైపు వెళ్లినా తాము నటించిన చిత్రాలనే ఎక్కువగా డైరెక్ట్ చేశారు.
కానీ రవితేజ మాత్రం మరో హీరోతో దర్శకునిగా మారనున్నాడని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు నందమూరి కళ్యాణ్‌రామ్. ‘కిక్2’ చిత్రం సమయంలో రవితేజకి, నందమూరి కళ్యాణ్‌రామ్‌కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు కాగా రవితేజ హీరో.. నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాత. సినిమా డిజాస్టర్ అయినా రవితేజ-కళ్యాణ్‌రామ్‌ల బంధం బలపడింది. తాజాగా రవితేజ, కళ్యాణ్‌రామ్‌కి ఓ స్టోరీ చెప్పడం జరిగిందని, ఈ స్టోరీ కళ్యాణ్‌రామ్‌కి బాగా నచ్చడంతో ఓకే చెప్పాడని సమాచారం.
మరోవైపు కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా మారి, మరలా ప్రస్తుతం కమెడియన్‌గా రీఎంట్రీ ఇచ్చిన సునీల్ ఇటీవల సాయిధరమ్‌తేజ్‌కి ఓ కథ చెప్పాడని సమాచారం. వీరిద్దరు ప్రస్తుతం ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వీలుంటే నిన్ను డైరెక్ట్ చేస్తానని సునీల్ తేజుతో చెప్పేవాడని, త్వరలో వారిద్దరి కాంబినేషన్‌లో చిత్రం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి రవితేజ, సునీల్‌లు నిజంగా దర్శకులుగా మారితే వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సివుంది...!