ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ, నారాలోకేష్, పవన్‌కళ్యాణ్, వైఎస్ జగన్ వంటి నేతలు పోటీ చేయనున్న స్థానాలపై అందరిలో ఉత్కంఠ ఉండటం సహజమే. కానీ వీరు గాక మరో స్థానంపై ఇప్పుడు అందరి దృష్టి మరలింది. అదే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారకరామారావు జన్మస్థలం ఉండే గుడివాడ నియోజకవర్గం. ఈ స్థానం నుంచి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో టిడిపి తరపున విజయం సాధించిన ఆయన తర్వాత వైసీపీలో చేరిపోయాడు. ఉప ఎన్నికల్లో కూడా విజయ దుందుభి మోగించాడు.
ఇక 2014లో కూడా టిడిపికి షాకిస్తూ మరోసారి విజయం సాధించాడు. మొదట ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉండేది. కానీ కొడాలినాని వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాక దీనిని వైసీపీకి కంచుకోటగా మార్చాడు. అయితే దీని వెనక జూనియర్ ఎన్టీఆర్, నాటి ఆయన తండ్రి హరికృష్ణల మద్దతు కూడా ఉందనే ప్రచారంలో కూడా కొంత నిజం ఉంది. ఈసారి కూడా గుడివాడ నుంచి తాను గెలవడం ఖాయమని, టిడిపిని తన నియోజకవర్గం నుంచి తరిమేస్తానని నాని అంటున్నాడు. దాంతో చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కృష్ణాజిల్లాకు చెందిన బలమైన దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు, రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షుడైన దేవినేని అవినాష్‌ని, కోడాలి నానికి పోటీగా నిలబెడుతున్నాడు.
దీంతో ఈ స్థానంలో గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. ఎంతైనా మూడుసార్లు ఎన్నికైన కొడాలినానిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. మరోవైపు ధన బలంలో కూడా నానితో దేవినేని అవినాష్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఒకసారైనా దేవినేని అవినాష్‌కి చాన్స్ ఇవ్వాలని కొడాలి నానిని పక్కనపెట్టాలని ఓటర్లు భావిస్తారని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి గుడివాడ బిగ్‌ఫైట్ ఏపీలో చర్చనీయాంశంగా మారింది.