రానురాను దేశంలో కుల, మత, ప్రాంతీయ విభేధాలు పొడసూపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి వాటిని తలపిస్తున్నాయి. ఇప్పటికే కమ్మ అంటే చంద్రబాబు, రెడ్డి అంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కాపు అంటే పవన్ అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో డబ్బు కంటే కుల ప్రభావం అధికంగా ఉండనుందని, ఓటుకి నోటుని ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ నుంచి తీసుకున్నా వారు ఓటు వేసేది మాత్రం కులాన్ని చూసే అని గట్టిగా అర్ధమవుతోంది. ముఖ్యంగా ఈ కులాల కుంపట్లు ఎంతదాకా వెళ్లాయంటే టిడిపి, వైసీపీ, జనసేనలలో ఎవరో ఒకరు తమ కులం వారిని నిలబెడితే ఇతర కులాలకు చెందిన సమర్ధవంతమైన నాయకులు ఉన్నప్పటికీ ఎదుటి పార్టీ టిక్కెట్ కేటాయించిన సామాజిక వర్గానికే ఇతర పార్టీలు కూడా టిక్కెట్లు ఇస్తున్నాయి.
ఒకప్పుడు వైసీపీ రెడ్డికి ఇస్తే టిడిపి కమ్మకి ఇచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వైసీపీ లేదా తెలుగుదేశం ఏ కులం వారికి సీటు ఇస్తే మిగిలిన పార్టీలు కూడా అదే కులం వారికి ఇస్తూ, ఆ సామాజిక ఓట్లు చీలిపోయేలా చేసి, మనం గెలవకపోయినా ఫర్వాలేదు.. ఎదుటి వాడు గెలవకూడదనే మంత్రాగాన్ని అమలు చేస్తూ ఉండటం విశేషం. దీనికి నెల్లూరు జిల్లాను బాగా ఉదాహరణగా తీసుకోవచ్చు. నెల్లూరులో రెడ్లది బలమైన వర్గం. దాంతో వైసీపీతో పాటే టిడిపి కూడా రెడ్ల అభ్యర్ధులనే వారికి పోటీకి దింపుతోంది.
ఇక గుడివాడలో కొడాలి నానికి బదులుగా దేవినేని అవినాష్‌ని నిలపడం, గుంటూరు జిల్లా పెదకూరపాడులో వైసీపీ సీటుని ఆశిస్తున్న పార్టీ సమన్వయకర్త, ఎంతో కాలంగా వైసీపీని నమ్ముకుని పార్టీని నియోజకవర్గంలో బలంగా తయారు చేసిన కావటి మనోహర్‌నాయుడు స్థానంలో నంబూరి శంకర్‌రావు అనే కమ్మ వ్యక్తికి ఇచ్చారు. దీనికి కారణం స్పష్టం. ఈ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్ బరిలో ఉండటమే కారణం. ఇలా ప్రస్తుతం ఏపీ మొత్తం కుల సెగలలో వేడి కుంపటి రాజుకుంటూ, చలిమంటల్లో చలికాచుకుంటున్నారు.