ఏపీలో ఎన్నికల చిత్రం రోజు రోజుకి రంగులు మార్చుకుంటోంది. ఒకవైపు వైసీపీ, టిఆర్‌ఎస్, బిజెపిలతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని విమర్శలు వస్తూంటే, వైసీపీ నాయకులు మాత్రం జనసేన, ప్రజాశాంతిపార్టీల వెనక టిడిపి హస్తం ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే చంద్రబాబుకి రిటర్న్‌గిఫ్ట్ ఇస్తానని హెచ్చరించిన కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీతో జగన్ సమావేశం అయ్యాడు. అంతేకాదు.. కొద్దికాలం కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రచారం కోసం వాడిన వాహనాలకు వైసీపీ రంగు పూసి లోపల సీట్లపై మాత్రం కారు గుర్తే ఉన్న ప్రచార రథాలు నెల్లూరులో ప్రత్యక్షమయ్యాయి.
ఇక బిజెపితో తాము రహస్య పొత్తు పెట్టుకున్నామని, బిజెపి ముఖ్యనాయకులైన కన్నాలక్ష్మీనారాయణతో పాటు పలువురు బిజెపి ప్రముఖులు పోటీ చేసే స్థానాలలో తాము బలహీనమైన అభ్యర్ధులను నిలబడతామని విజయవాడకి చెందిన వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ కోఠారి చేసిన వ్యాఖ్యలను టైమ్స్ నౌ పత్రిక స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టింది. ఇక వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ గుర్తునే పోలి ఉండే హెలికాప్టర్ గుర్తును ప్రజాశాంతి పార్టీకి చెందిన కె.ఎ.పాల్‌కి దక్కడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా కారుని పోలిన ట్రక్ గుర్తును ఈ సందర్భంగా వైసీపీ వారు గుర్తు చేస్తున్నారు.
ఇక రాజమండ్రి సీటు విషయంలో జనసేనకి పోటీకి టిడిపి బలహీనమైన అభ్యర్ధిని నిలబెట్టనుందనే ప్రచారం సాగుతోంది. ఎంతో బలమైన మురళీమోహన్‌ని కాదని, ఈ స్థానంలో ఆయన కోడలు రూపాని గానీ, మరో బలహీనమైన అభ్యర్థిని గానీ టిడిపి పెట్టేందుకు వ్యూహాలు పన్నుతోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ ఎన్నికల రాజకీయ సిత్రం మాత్రం రోజుకో రంగు మార్చుకుంటూ ఊసరవెల్లిలను తలపిస్తున్నాయనే చెప్పాలి.