ఈమధ్య మెగాబ్రదర్ నాగబాబు ఊపు మీదున్నాడు. తనకంటూ ఓ యూట్యూబ్ పెట్టుకుని రాజకీయాలపై, నాయకులపై సెటైర్లు సంధిస్తున్నాడు. గతంలో తమ ఫ్యామిలీ మీద, చిరు, పవన్‌లపై విమర్శలు చేసిన వారికి చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవలే ఓ బాబాని శిష్యులు అడిగే ప్రశ్నలకు సమాధానంగా ‘పప్పు అంటే ఒకటి మాట్లాడాలని అనుకుంటే దేవుడు ఆయన చేత మరోటి మాట్లాడించేవాడే పప్పు అని.. ఐదేళ్ల నుంచి చేసేది అభివృద్ది అని అదే ఐదు నెలల ముందు చేసేది మాత్రం ఆందోళన, పూర్తి చేస్తామని చెబుతున్నా ఎప్పటికీ పూర్తికానిది పోలవరం ప్రాజెక్ట్’ అంటూ నాగబాబు, లోకష్, చంద్రబాబులపై సెటైర్లు విసిరాడు.
ఇక ‘జబర్ధస్త్’ ప్రభావమో ఏమో గానీ ఆయన చేసే వ్యాఖ్యలన్నీ సెటైర్లుగా, పంచ్‌లుగా వ్యంగ్యాస్త్రాలతో నిండి ఉంటున్నాయి. బహుశా ఈ విషయంలో ఆయనకి హైపర్ ఆది వంటి వారు సాయం చేస్తున్నారేమో అనిపిస్తోంది. తాజాగా నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో బాబుపై రెచ్చిపోయాడు. ఆయన మాట్లాడుతూ, ఈసారి మా చంద్రబాబుకి మేం విశ్రాంతి ఇచ్చి తీరుతాం. తన మనవడు దేవాన్ష్‌తో ఆడిపాడుకునేందుకు అవకాశం ఇస్తాం. అందరు హాయిగా విశ్రాంతి తీసుకోవాలి గానీ, చంద్రబాబు మాత్రం పగలు రేయి తేడా లేకుండా ఎంత కాలం కష్టపడాలి? ఇదేమైనా న్యాయంగా ఉందా? ఈ వయసులో మనవడితో ఆడుకోవాలనే కోరిక ఆయనకు ఉండదా? ఏంటి? 70ఏళ్ల వయసులో చంద్రబాబుపై ప్రజలకు ఆ మాత్రం జాలి, దయా లేవా? అవే ఉంటే ఆయనను ఇంకా ఎందుకు కష్టపెడతారు? మళ్లీ మా చంద్రబాబే కావాలని ఆయనను ఎందుకు ఇబ్బందిపెడతారు?
ఈమధ్యే లోకేష్ తన తండ్రి 70ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్నాడని అన్నాడు. ఒక కొడుకుగా ఈ విషయంలో లోకేష్ బాధపడటంలో తప్పులేదు. అందుకే మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకి విశ్రాంతి ఇచ్చి తీరుతాం. తాత దగ్గర ఎలా ఆడుకోవాలో దేవాన్ష్ కూడా నేచ్చుకోవాలి కదా....! మళ్లీ బాబే రావాలనుకునే వారికి ఒకే విషయం చెబుతున్నా...మేం ఆయనకి తప్పనిసరిగా విశ్రాంతి ఇచ్చి తీరుతాం. ఆయన్ని మరలా కష్టపెట్టేందుకు ఇష్టం లేదు. కాబట్టి ఆయనకు విశ్రాంతి ఇస్తాం అని సెటైర్లు వేశాడు. ఇందులో నాగబాబు చెప్పినవన్నీ కరెక్టే.
కానీ నాడు చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పెట్టినప్పుడు. తాజాగా పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టిన తర్వాత తాము సినిమాలలో ఓ వెలుగు వెలుగుతూ లెజెండ్స్‌గా ఉన్నామని, సినిమాల ద్వారా వచ్చే కోట్లాది రూపాలయను ప్రజలకు సేవ చేసేందుకు వదులుకున్నామని అంటున్నారు. మరి పాపం.. కోట్లాది రూపాయలను, సినీ ఇండస్ట్రీలో తిరుగేలేని స్థానంలో ఉన్న చిరు, పవన్‌లు ఇలా కోట్లు నష్టపోయి తమకు సేవ చేద్దామని అనుకోవడం ఇష్లం లేకనే ప్రజలు చిరుకి ఓటేయలేదనే విషయం కూడా నిజమే కదా...? మరి ఈసారి కూడా పవన్‌కి అదే సీన్ ఎదురవుతుందో వేచిచూడాలి...! చిరు, పవన్‌లు సినిమాలలో విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేయడం ఓటర్లకు కూడా బాధగానే ఉందని నాగబాబు గ్రహించాలి.