చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆయన సోదరులైన నాగబాబు, పవన్‌కళ్యాణ్‌లు వ్యూహాలు, ప్రచారాలకే పరిమితం అయ్యారు గానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అల్లుఅరవింద్ ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు. ఇక పవన్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు మౌనంగా ఉన్నారు. నాగబాబు అయితే చిరు ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నాడు కాబట్టి మెగాభిమానులంతా కాంగ్రెస్‌కే అండగా నిలవాలని కోరాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏపీలో టిడిపి, వైసీపీ, జనసేన వంటి మూడు పార్టీలు అభ్యర్ధుల విషయంలో భారీ కసరత్తులు చేస్తున్నాయి. ఏరోజు ఏ నాయకుడు ఏ పార్టీని వీడుతాడో, ఏ పార్టీలో చేరుతాడో చెప్పలేకుండా పరిస్థితి ఉంది. పార్టీలో ఉన్న వారిలో బలమైన అభ్యర్ధులను ఎంపిక చేయడం మినహా ఇందులో పార్టీ అధ్యక్షులు చేయగలిగింది ఏమీ లేదు.
ఇక ఏపీలో ఎన్నికలను మొదటి విడతలోనే జరపాలని నిర్ణయించారు. నాలుగైదు విడతల్లో ఏపీ ఎన్నికలు జరుగుతాయని భావించిన రాజకీయ పార్టీలకు ఇప్పుడు అతి తక్కువ వ్యవధి ఉండటం, చేతిలో పట్టుమని నెల కూడా లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే జనసేనాని పలువురు అభ్యర్ధులను ప్రకటించాడు. తాజాగా ఆయన తన సోదరుడు నాగబాబుకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నాడని వార్తలు వచ్చాయి. పవన్ మొదట్లో జనసేన పార్టీ పెట్టడం కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. తన కుటుంబానికి తన పార్టీకి లింక్ పెట్టవద్దని, తన ఫ్యామిలీ మెంబర్స్‌ని తాను విడిగా చూస్తానని కూడా పవన్ ప్రకటించాడు. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఒకసారి, తమ్ముడు పవన్ కోరితే పోటీ చేస్తానని ఒకసారి.. ఇలా పలు సందర్భాలలో నాగబాబు పలు వ్యాఖ్యలు చేశాడు.
ఎంత వద్దన్నా నాగబాబు నుంచి వరుణ్‌తేజ్, రామ్‌చరణ్, కళ్యాణ్‌దేవ్, సాయిధరమ్‌తేజ్‌లు కూడా పవన్‌కి మద్దతు ఇచ్చారు. నాగబాబు, వరుణ్‌తేజ్‌లు పార్టీకి విరాళం కూడా అందించారు. ఈ తరుణంలో నాగబాబుని వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసే చాన్స్‌ని స్వయాన పవన్ తన సోదరుడికి ఇవ్వనున్నాడని ప్రచారం సాగుతోంది. పవన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే తనకి పట్టు ఉన్న జిల్లాలపైనే దృష్టి కేంద్రీకరించాడు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఇక్కడే వీలైనన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలిచి వచ్చే ప్రభుత్వంలో కీలకపాత్రను పోషించాలని భావిస్తున్నాడు. మరి నాగబాబు విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో వేచిచూడాల్సివుంది..!