గంటాశ్రీనివాసరావు... ఈయనకు రాజకీయ నాయకునిగా ఏపీలో మంచి పట్టు ఉంది. సమయానుకూలంగా పార్టీలలోకి జంప్ జిలానీలు చేసినా అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి, ఆ తర్వాత ప్రజారాజ్యంని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్‌లో, రాష్ట్ర విభజన తర్వాత తెలివిగా కాంగ్రెస్‌ని వీడి తెలుగుదేశంలోకి వచ్చిన ఆయన అపజయం అనేది తెలియకుండా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకి ఎంతో కావాల్సిన, నెల్లూరు రెడ్లతో ఆర్ధికంగా ఢీకొట్టగలిగిన నారాయణ విద్యా, వైద్య సంస్థల అధినేత, పురపాలక శాఖా మంత్రి నారాయణతో వియ్యం అందుకున్నాడు. ఇప్పటికీ ఈయన ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని అటు చిరుతో, ఇటు పవన్‌తో కూడా సత్సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తుంటారు.
కానీ కొంతకాలం కిందట గంటా అంటే తనకేమీ కోపం లేదని, కానీ ఆయనను తన పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని స్వయంగా జనసేనాని పవన్ ప్రకటించాడు. ఇప్పుడు గంటాకి రాజకీయంగా ఓ సమస్య వచ్చిపడింది. అదే తన నియోజకవర్గాన్ని లోకేష్‌కి ఇవ్వడం. దీని వెనుక ఎంతో మతలబు ఉందని, ఎన్నో హామీల తర్వాతనే చంద్రబాబుకి గంటా సరే అన్నాడనే ప్రచారం సాగుతోంది. గంటా శ్రీనివాసరావుకి మూడు నాలుగు పోర్ట్‌లలో భాగస్వామ్యం ఉంది. ఆయన రాజకీయాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో, ఆర్ధికంగా బలపడేందుకు, వ్యాపారాలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాడు. ఈయన వీక్‌నెస్ ఏమిటంటే రాజకీయాలను వ్యాపారాలతో ముడిపెట్టడం అనేది జగమెరిగిన సత్యం. ఇదే వీక్‌నెస్ మీద గంటాను బాబు దారిలోకి తెచ్చుకున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం మోదీ గ్రాఫ్ పెద్దగా బాగా లేదు. ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో థర్డ్‌ఫ్రంట్ వస్తుంది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే నీకు పార్టీ తరపున కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తాను. అది నీ వ్యాపారాభివృద్దికి కూడా ఎంతో తోడ్పడుతుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో, అందునా పార్టీలో నెంబర్2 వంటి చంద్రబాబు వారసుడికి నో చెప్పే చాన్స్ లేకపోవడం వల్లే గంటా ఓకే అనక తప్పలేదట. అయితే మరలా కేంద్రంలో మోదీ సంకీర్ణ ప్రభుత్వంగా ఎన్డీయేలో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యేగా ఉంటే పార్టీ అయినా ఫిరాయించి మరలా మంత్రి కావచ్చు. కానీ ఎంపీ అంటే రెంటికి చెడ్డ రేవడి అవుతుందనే భయం ఆయనలో, ఆయన సన్నిహితులలో ఉంది. మరి చంద్రబాబు జోస్యం ఫలిస్తుందా? గంటా గట్టెక్కుతాడా? రాజకీయంగా మొదటి సారి ఇబ్బందులు ఎదుర్కొంటాడా? అనేవి వేచిచూడాల్సివుంది..!