జనసేనానికి ఈ సారి తన పార్టీ పూర్తిగా అధికారంలోకి వస్తుందనే ఓవర్‌కాన్ఫిడెన్స్ లేదు. పార్టీని స్థాపించడంలో ఎంతో ఆలస్యం చేసి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిని కావాలని భావించి అతి తక్కువ సీట్లతో దెబ్బతిన్న చిరు ప్రజారాజ్యం ఫలితాలు ఏమిటో అందరికంటే పవన్‌కే ఎక్కువ తెలుసు. ఈసారి నన్ను గెలిపించండి.. సీఎంని చేయండి అనే మాటలు చెబుతున్నా ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకోవడం, తనంటూ ఎంత శాతం ఓటు బ్యాంక్ ఉంది? అనే విషయాలపైనే ఆయన దృష్టి సారిస్తున్నారు. ఈసారి గెలిచి అధికారం చేపట్టాలని భావించే వారు నాకు అవసరం లేదు. పదేళ్లు, ఇరవైయేళ్లయినా సరే నా కోసం, నన్ను నమ్మి వచ్చే వారికే తన పార్టీలో చోటు అని ఆయన ప్రకటించాడు.
ఇటీవల ఆయన నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం నుంచి పసుపులేటి సుధాకర్ అనే అభ్యర్థిగా టిక్కెట్ ఇచ్చాడు. నిజానికి ఇతను మంచి పట్టు ఉన్న నాయకుడు. ఆర్ధికంగా బాగా ఉండి, పలు సేవాకార్యక్రమాలలో ఆయన బిజీగా ఉంటూ కావలి నియోజకవర్గ ఓటర్ల మనసులను గెలుచుకున్నాడు. ఇక్కడి నుంచి వైసీపీ తరపున రామిరెడ్డి ప్రతాపకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలుగుదేశం అభ్యర్థి బీదా మస్తాన్‌రావుకి కూడా మంచి పేరుంది. ఇలాంటి సమయంలో పోటీ వైసీపీ, టిడిపి మధ్యనే అని భావించే తరుణంలో రేసులో నేను కూడా ఉన్నానంటూ జనసేన అభ్యర్థి హల్‌చల్ చేస్తున్నాడు.
ఇక తాజాగా పవన్ మరో ఇద్దరిని ఎంపీ స్థానాలకు ప్రకటించాడు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్‌ని, రాజమండ్రి ఎంపీగా ఆకుల సత్యనారాయణలు పోటీ చేస్తారని పవన్ ప్రకటించాడు. శేఖర్ గారు బడుగు, బలహీన వర్గాలకు ఏదో మంచి చేయాలనే తపన ఉన్నవాడు. ఆయన పార్టీలో చేరడం కేవలం ఫార్మాల్టీ మాత్రమే. ఆయన పార్టీలోకి వస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పాను. ఆయన మనసుతో నా మనసు ఎప్పుడో కలిసింది. ఆయన మా పార్టీలోకి రావడం ఆనందంగా ఉంది అని చెప్పాడు.
ఇక ఆకుల సత్యనారాయణ గురించి మాట్లాడుతూ, ఆ కుటుంబంతో నాకెంతో ఆత్మీయబంధం ఉంది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నేను నిరాహారదీక్ష చేసినప్పుడు ఆయన కుటుంబం కూడా నిరాహార దీక్షలో పాల్గొంది. 2014లో రాజమండ్రి నుంచి గెలిచి, ఇప్పుడు నా పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని పవన్ తెలిపాడు. ఇక అతి కొద్ది సమయంలోనే పవన్ మరో 32 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను, ఏడుగురు ఎంపీ సభ్యులను ప్రకటించనున్నాడు. ఇక మార్చి14న రాజమండ్రిలో జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలో మిగిలిన వారిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ కూడా రాజమండ్రి నుంచే ఓసారి తన రాజకీయ ప్రస్థానానికి వేదికగా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.