తమిళ స్టార్ విశాల్‌కి ఓ సెంటిమెంట్ ఉంది. గతంలో ఆయనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఏదైనా సినిమా షూటింగ్‌లో తాను గాయపడితే ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక విషయానికి వస్తే తెలుగులో ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్ వంటి హీరోలకు డ్యాన్స్‌లలో మంచి ప్రావీణ్యం ఉంది. తెరపైన వారు వేసే స్టెప్పులు చూసి ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ ఆనందపడి పోతూ ఉంటారు గానీ ఆయా క్లిష్టమైన స్టెప్స్‌ని వేయడం అంత ఈజీ కాదు. చిరంజీవి తర్వాత ఆ స్థానం ఎన్టీఆర్, బన్నీ, చరణ్, రామ్ వంటి వారికే దక్కుతుంది.
ప్రస్తుతం విశాల్ తెలుగులో ఎన్టీఆర్-పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్’ చిత్రాన్ని ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఆల్‌రెడీ ‘టెంపర్’ బాలీవుడ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన నేపధ్యంలో కోలీవుడ్‌లో ‘అయోగ్య’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను విశాల్ పోషిస్తుండగా, అల్లుఅర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రంలోని ‘బ్లాక్‌బస్టర్.. బ్లాక్‌బస్టరే’ అనే పాటను ఇందులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో బన్నీ వేసిన క్లిష్టమైన స్టెప్స్ గురించి మనకి బాగా తెలుసు. విశాల్ హైట్‌కి, పర్సనాలిటీకి ఇలాంటి స్టెప్స్ చాలా కష్టమే అయినా విశాల్ బన్నీ తరహాలో తెగ ప్రాక్టీస్ చేసి మరీ స్టెప్స్ వేస్తున్నాడట.
ఈ సందర్భంగా ఆయన గాయపడ్డాడని సమాచారం. మోచేయి వాచిపోవడంతో పాటు కాలుకి కూడా దెబ్బలు తగిలాయట. దాంతో ప్రస్తుతానికి ఈ పాట చిత్రీకరణను వాయిదా వేశారు. విశాల్ సరసన రాశిఖన్నా నటిస్తుండగా, మరో కీలకపాత్రలో పార్తీబన్ నటించనున్నాడు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్‌తో పాటు జ్ఞానవేల్ రాజాలు సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం తెలుగులో విడుదలయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది ఆల్‌రెడీ టెంపర్ మూవీ రీమేక్ కాబట్టి దీనిని తమిళంలోనే విడుదల చేయనున్నారు.