మొదటి నుంచి అన్ని భాషల వారిది ఒక దారైతే కన్నడ పరిశ్రమది మరో దారి. అక్కడ కన్నడ చిత్రాలు ఇంకా మన పాతకాలం నాటివిగా రూపొందుతూ ఉంటాయి. అందుకే అక్కడి ప్రేక్షకులు భారీగా తెరకెక్కే తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ చిత్రాలవైపు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ భారీగా రూపొందే ఇతర భాషల వల్ల తమ కన్నడ చిత్రాలకు కలెక్షన్లు తగ్గడం, థియేటర్ల సమస్యలు ఎదురవుతున్నందు వల్ల ఇతర భాషా చిత్రాలను కన్నడలో రీమేక్ చేయవచ్చే గానీ డబ్బింగ్ చేయకూడదని అక్కడి సినీ పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. ఇందులో స్వర్గీయ రాజ్‌కుమార్ కూడా ముఖ్యుడు. ఇలాంటి నిర్ణయం వల్ల కన్నడలో సూపర్‌స్టార్స్‌గా వెలిగిన కన్నడ ప్రభాకర్, దేవరాజ్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర వంటి వారు ఇతర భాషల్లో విలన్లుగా కూడా నటించే వారు.
ఇక కన్నడలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ చిత్రాలు కన్నడ నుంచి తెలుగులోకి అనువాదం అయ్యేవే గానీ ఆయన నటించిన తెలుగు చిత్రాలు కన్నడలో డబ్ అయ్యేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కన్నడలో కూడా మన చిత్రాలను స్ట్రెయిట్ వెర్షన్‌ని కాకుండా డబ్ చేసే అవకాశం ఆ పరిశ్రమ కల్పించింది. దీంతో మొదట తమిళ స్టార్ అజిత్ దీనిని బాగా ఉపయోగించుకున్నాడు. తాను నటించిన ‘వివేగం, విశ్వాసం’ చిత్రాలను డబ్ చేసి కర్ణాటకలో విడుదల చేసి బాగా కలెక్షన్లు రాబట్టాడు. ఇక తెలుగులో దాదాపు ఏడాది కిందట వచ్చిన సుకుమార్-రామ్‌చరణ్‌ల ‘రంగస్థలం’ త్వరలోనే కన్నడలోకి అనువాదమవుతోంది.
ఇక తాజాగా విజయ్‌దేవరకొండ హీరోగా, కన్నడిగుల ఆరాధ్యదేవతగా మారిన రష్మికా మందన్న జంటగా రూపొందుతున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కన్నడలో కూడా ఒకేసారి అనువాద వెర్షన్ విడుదల కానుంది. ఆ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సై..రా..నరసింహారెడ్డి’ కూడా అక్కడ డబ్ కావడం ఖాయం. తమ స్ట్రెయిట్ చిత్రాల ద్వారానే కన్నడలో బాహుబలితో సంచలనం సృష్టించిన ప్రభాస్‌కే కాదు... తెలుగుకి సమానంగా మెగా హీరోలకు కన్నడ నాట ఫాలోయింగ్ ఉండటంతో చిరు చిత్రం అక్కడ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సివుంది. మొత్తానికి ఇది తెలుగు నిర్మాతలకు మరో బంగారు బాతు గుడ్డుగా మారడం ఖాయమనే చెప్పాలి.