దక్షిణాదిలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయనకు దక్షిణాదిలోనే కాదు... బాలీవుడ్‌తో పాటు మలేషియా, జపాన్ వంటి దేశాలలో కూడా మంచి గుర్తింపు ఉంది. కానీ గత కొంతకాలంగా రజనీ తన చిత్రాల కథలు కేవలం తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ ఉండటంతో ఇవి తమిళంలో తప్ప ఇతర భాషల్లో ఆదరణ పొందలేకపోతున్నాయి. కాస్త ‘2.ఓ’ మాత్రమే దీనికి మినహాయింపు. కానీ చాలా గ్యాప్ తర్వాత రజనీకాంత్ దేశవ్యాప్తంగా పేరున్న క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మొట్టమొదటి చిత్రం ఇదే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మురుగదాస్ ‘సర్కార్’ తర్వాత, రజనీ ‘పేట’ తర్వాత రూపొందుతున్న చిత్రం ఇదే. ఈ నెలాఖరులో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఇందులో రజనీకాంత్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడట. రజనీ పోలీస్‌గా కనిపించి చాలా కాలమే అయింది. చట్టంలోని, గవర్నమెంట్‌లోని లొసుగులను ఉపయోగించుకుంటూ మోసాలు చేసే వారి భరతం పట్టే పోలీస్ పాత్రను ఇందులో రజనీ చేయనున్నాడట. ఇక కథా నేపధ్యం ప్రకారం ఈ మూవీ ముంబై నేపథ్యంలో సాగనుంది. గతంలో రజనీ నటించిన ‘బాషా, కాలా’ వంటి చిత్రాలు ముంబై బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందడం విశేషం.
మరోవైపు మురుగదాస్ విజయ్‌తో చేసిన తుపాకి, సూర్యతో తీసిన గజిని చిత్రాలు కూడా ముంబై బ్యాక్‌డ్రాప్ చిత్రాలే కావడం విశేషం. ఎక్కువ భాగం ముంబైలో షూటింగ్ జరిపే ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి గత కొంతకాలంగా రజనీ చిత్రాలకు ఇతర భాషల్లో రాని క్రేజ్‌ని ఈ చిత్రం సొంతం చేసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.