మీడియం, చిన్న బడ్జెట్ మూవీస్ తో ఒక్కసారిగా హీరోగా తనకంటూ మంచి స్టేటస్ ఏర్పరుచుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. హీరోలకు సినిమాలు హిట్ అయితేనే... ఆ హీరో మార్కెట్ కళకళలాడుతుంది. లేదంటే ఆ హీరోతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. గత ఏడాది రంగుల రాట్నం, లవర్స్ సినిమాల డిజాస్టర్స్ తో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నప్పటికీ... తాజాగా దిల్ రాజు తో ఒక సినిమాని, రానా ఓన్ బ్యానర్ లో మరో సినిమాని రాజ్ తరుణ్ కమిట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.
రానా కన్నా ముందుగానే.. దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే రాజ్ తరుణ్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చెయ్యడం పక్కా.. కానీ.. రాజ్ తరుణ్ మార్కెట్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అందుకే దిల్ రాజు రాజ్, తరుణ్ తో చెయ్యబోయే సినిమా విషయంలో ఒక కండిషన్ పెట్టినట్లుగా ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. రాజ్ తరుణ్ కి ఒక టర్కిష్ మూవీ నచ్చి.. దాన్ని రీమేక్ చెయ్యమని దిల్ రాజుని అడిగాడట. అయితే ఆ సినిమా చూసిన దిల్ రాజు కూడా రాజ్ తరుణ్ ప్రపోజల్‌కి ఓకె చెప్పాడట. బట్ కండిషన్ అప్లై అన్నాడట.
అదేమిటంటే.. రాజ్ తరుణ్‌కి ఈ సినిమా చెయ్యాలంటే... రెమ్యునరేషన్ అడగకూడదని.. రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా.. సినిమా ప్రాఫిట్ లో వాటా ఇస్తానని మెలిక పెట్టాడట. అయితే ప్రస్తుతం దీనావస్థలో ఉన్న రాజ్ తరుణ్.. దిల్ రాజు ప్రపోజల్ కి తలాడించి.. ఆ సినిమా చేసే దర్శకుడి వేటలో నిమగ్నమయ్యాడట. మరి చిన్నచిన్న సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్న దిల్ రాజు తెలివి తేటలు చూసారా.... ప్లాప్స్ లో ఉన్న హీరోని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు.