ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విభజించి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడాన్ని గతంలో పలువురు ఆంధ్రానేతలు వ్యతిరేకించారు. సాక్షాత్తు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా విభజనను ఒప్పుకోలేదు. ఇలా రాష్ట్ర విభజనను ఎంత మంది వ్యతిరేకించినా నాటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం ఈ విషయంలో గట్టి ప్రయత్నాలు చేశాడు. అధిష్టానానికి భయపడకుండా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో తన వంతు కృషి చేశాడు. చివరకు లోక్‌సభలో పెప్పర్ స్ప్రేను కూడా వాడి సమైకాంధ్ర సింహం అనే బిరుదును సాధించుకోగలిగాడు.
ఇక విషయానికి వస్తే రాజకీయాలలో మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు ఇలా ఉంటారే గానీ మాజీ రాజకీయ నాయకులు అనే వారు తక్కువ. కానీ ఇది లగడపాటి విషయంలో నిజమైంది. సమైక్యాంధ్ర విడిపోతే తాను మరలా రాజకీయాలలోకి రానని, ఇకపై పోటీ చేయనని నాడే లగడపాటి రాజగోపాల్ కుండబద్దలు కొట్టాడు. అన్నట్లుగానే 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. కానీ రాబోయే ఎన్నికల్లో ఆయన మరోసారి రాజకీయాలలోకి వచ్చి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి ఆయన నరసారావు పేట నుంచి బరిలోకి దిగుతాడనే వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని నరసారావుపేట ఎంపీ స్థానం తనకి ఇస్తే ఆయన తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈమధ్యకాలంలో ఆయన తరచుగా చంద్రబాబుని కలిసి వస్తున్నారు. పైకి మాత్రం ఇతరపనుల గురించి మాట్లాడేందుకు వచ్చానని బుకాయిస్తున్నా కూడా లగడపాటి చంద్రబాబుని కలవడం వెనుక ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉందని అంటున్నారు. తాజాగా లగడపాటి కోడెల శివప్రసాద్‌ని కూడా కలిసి వచ్చాడు.
నరసారావుపేట వైసీపీ సమన్వయకర్తగా లాగు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. ఆయనకే ఎంపీ సీటు వస్తుందని ప్రచారం సాగుతోంది. దీంతో ఆయనకు పోటీగా బలమైన అభ్యర్థిని నిలపాలని టిడిపి వ్యూహాలు రచిస్తోంది. నరసారావు పేటలో మంచి పట్టు ఉన్న కోడెలను రాజగోపాల్ కలవడం వెనుక ఇదే కారణమని అంటున్నారు. ఇక లగడపాటి తన సర్వేలతో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఆయన అంచనా బోల్తాపడింది. ఇక ఏపీలో జగన్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నంత కాలం చంద్రబాబుకి పోటీ లేదని కొంతకాలం కిందట లగడపాటి తన అభిప్రాయం చెప్పిన సంగతి తెలిసిందే.