వచ్చే పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 11న ఈ ఎన్నికలు జరుగనున్నాయి. అంటే ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌కి కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో అన్ని నియోజకవర్గాలలో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఖరారులో తలమునకలై ఉన్నాయి. ఇక విషయానికి వస్తే గతంలో నారా లోకేష్ దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యాడు. అది ప్రతిపక్షాలకు ఓ ఆయుధం అయింది. సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి పంచాయితీ రాజ్ శాఖ ఎలా ఇస్తారని పవన్, జగన్‌లు లోకేష్‌ని ఎద్దేవా చేశారు. దాంతో ఈయన తనపై విమర్శకులకు సమాధానం చెప్పాలంటే ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరాల్సివుంది. ఇందుకోసం ఆయన తండ్రి, ఏపీ సీఎం, మామయ్య బాలకృష్ణలు బాగా కసరత్తు చేస్తున్నారు.
మొదట నారాచంద్రబాబునాయుడు తన స్థానమైన కుప్పం నుంచి లోకేష్‌ని పోటీ చేయించి, తాను అనంతపురం నుంచి పోటీ చేయాలని భావించాడు. బాలయ్యని కృష్ణాజిల్లాలోని ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సీన్ మారింది. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కి గెలుపు ఖాయమని అనిపించే చోట నుంచి పోటీ చేయించాలని పలు సర్వేలు నిర్వహించాడని తెలుస్తోంది. ఎట్టకేలకు భీమిలి నియోజకవర్గం నుంచి లోకేష్‌ని పోటీకి దింపాలని నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. ఇక లోకేష్ విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది. కానీ జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఎన్ని స్థానాలలో పోటీ చేస్తాడనే విషయం ఇంకా తేలలేదు.
అప్పుడెప్పుడో పవన్ తాను అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, అనంతపురం జిల్లాని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తాడనే విషయంలో ఏమాత్రం క్లారిటీ లేదు. బహుశా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తనకు మంచి పట్టు ఉన్న గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, తిరుపతి వంటి స్థానాలలలో ఏదో ఒక చోటి నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఎన్నికలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో పవన్ ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది.
గతంలో చిరు ఇలాంటి పలు విషయాలలో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోయి ఫలితం అనుభవించాడు. మరి పవన్ అయినా ప్రజారాజ్యం అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని అభ్యర్దుల ఎంపిక, తాను పోటీ చేసే స్థానంపై వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.