రాజకీయాలలోనే కాదు.. సినిమా రంగంలో కూడా రాజకీయాలకు కొదువ లేదు. ఎప్పుడు ఎవరు ఎవరిపై విరుచుకుపడతారో? ఎప్పుడు స్నేహహస్తం అందిస్తారో అర్ధం కాని పరిస్థితి. ఇక పాలిటిక్స్‌లానే సినీ ఇండస్ట్రీలో కూడా శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత నిజమేనని తాజాగా మరోసారి వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాబ్రదర్ నాగబాబు నిరూపించాడు. కొంతకాలం కిందట వర్మని నాగబాబు ఏ రేంజ్‌లో తిట్టాడో తెలిసిందే. అక్కుపక్షి అని నానా మాటలు అన్నాడు. మరో ఇంటర్వ్యూలో ఆయన వర్మ పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి వారి గురించి నేను మాట్లాడను అని తెగేసి చెప్పాడు.
అదే నాగబాబు గతకొంతకాలంగా నందమూరి-నారా ఫ్యామిలీలను టార్గెట్ చేస్తున్నాడు. వీలున్ననప్పుడల్లా బాలయ్య, చంద్రబాబు, నారా లోకేష్‌లపై సెటైర్లు పేలుస్తున్నాడు. ఇదే సమయంలో రాంగోపాల్‌వర్మ మరోవైపు నందమూరి-నారా ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తీశాడు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగబాబు వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాకు వర్మ అంటే ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఇష్టం లేదు. గౌరవం కూడా లేదు. అయితే ఆయనను ఓ దర్శకునిగా మాత్రం నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆయన ఎన్ని ఫ్లాప్‌లు తీసినా ఆయనలో ఓ గొప్ప దర్శకుడు ఉన్నాడు. ఈ విషయాన్ని అందరితో పాటు నేను కూడా ఒప్పుకుంటాను... నమ్ముతాను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వర్మ అందరికీ నచ్చేట్లుగా, మెచ్చుకునేట్లుగా, ఆకట్టుకునేలా నిజాలను బయటపెడుతూ.. నిజాలను అందరికీ తెలియజేసే విధంగా తీసి ఉంటాడనే నమ్మకం నాకుంది. తప్పకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందనే అనుకుంటున్నాను.
ఎన్టీఆర్ సినీ కెరీర్ అద్భుతంగా సాగింది. కానీ పొలిటికల్‌గా మాత్రం ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆయన చివరి జీవితం బాధాకరం. ఇప్పుడు వాటిని వర్మ చూపించాలని అనుకోవడం చాలా మంచి నిర్ణయం.. అంటూ పొగడ్తలు గుప్పించడంతో అందరు అవాక్కవుతున్నారు.