సినిమాల్లో కామెడీ వేషాలు వేస్తూనే.. హీరోగానూ సినిమాలు చేసి.. ప్రస్తుతం సినిమాల కన్నా ఎక్కువగా బుల్లితెర మీద సందడి చేస్తున్న కమెడియన్ అలీ.. తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తాజాగా కాదుగాని. ఎప్పటినుండో అలీ రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే సినిమాల్లో స్టార్ హీరో.. ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి పరమ భక్తుడు అలీ. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ లేకుండా సినిమాలు లేవన్నట్టుగా పవన్ కి అత్యంత సన్నిహితుడుగా అలీ ఉండేవాడు. ఇక రాజకీయాల్లోకి వస్తున్న అలీ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరుతాడనే అనుకున్నారు అంతా. కానీ ట్విస్టులు మీద ట్విస్టులిస్తున్నాడు అలీ. నిన్నటివరకు తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చేవారి పార్టీలోనే చేరుతానని స్పష్టం చేసిన అలీ.. టిడిపిలో చేరిక ఖాయమనే అనుకున్నారు.
ఇక రాజమండ్రి వాస్తవ్యుడైన అలీ గుంటూరు పశ్చిమ సీటుని ఆసిస్తూ వచ్చాడు. మరి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే.. టిడిపిలో చేరుతాడని అనుకున్న అలీ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. అనుకోకుండా ఈరోజు జగన్ సమక్షంలో వైసిపి పార్టీలో చేరాడు. అది కూడా ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యనని మరీ చెబుతున్నాడు అలీ. వైసిపి పార్టీలో చేరడానికి లోటస్ పాండ్ వెళ్లిన అలీ.. జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నాడు. అయితే తాను రాజమండ్రి వాస్తవ్యుడిని కాబట్టి.. గుంటూరు సీటు అలీ కి ఎలా ఇస్తారని చాలామంది అభ్యంతరాలు పెట్టారని.. అలాగే ఇక్కడ అభివృద్ధి చేసిన వాళ్ళని కాదని ఆయనకి అక్కడ సీటు ఎలా ఇస్తారని చాలామంది అన్నారని.. అయితే తాను ఈ ఎన్నికల్లో వైసిపి తరుపున పోటీ చెయ్యనని..... కేవలం వైసిపి పార్టీ తరుపున ప్రచారం చేస్తానని.. జగన్ రావాలి.. జగన్ కావాలి సీఎం అని అన్నాడు. ఇంకా అలీ అన్ని రాజకీయ పార్టీలలో తనకు కావాల్సిన వారు ఉన్నారని.. కానీ జగన్ తోనే ఏపీ భవిష్యత్తు ముడి పడి ఉందని అందుకే వైసిపిలో చేరానని చెప్పాడు.