రసవత్తరంగా సాగిన `మా` ఎన్నికల ఎపిసోడ్ అర్థరాత్రి ముగిసింది. `ఏప్రిల్ 1 విడుదల` సినిమాలో తన కోపాన్ని చూపించడం కోసం షాప్ ఓపెనింగ్‌కి పిలిచి రిబ్బన్‌కి బదులు దుంగను కోయమన్నట్టుగా ఈ ఎన్నికల ఫలితాలు రాత్రి 7 గంటల నుంచి అర్థ్రరాత్రి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో సాగడం ఈ ఎన్నికల ప్రత్యేకత. శివాజీరాజా ప్యానల్‌కు, నరేష్ ప్యానల్‌కు జరిగిన ఎన్నికల పోరులో నరేష్ `మా` అధ్యక్షుడిగా విజయం సాధించాడు. తన ప్రత్యర్థి శివాజీరాజాను 68 ఓట్లు ఆధిక్యంతో ఓడించడం గమనార్హం.
నరేష్‌కు 268 ఓట్లు పోలవ్వగా తన ప్రత్యర్థి శివాజీరాజాకు 199 ఓట్లు పోలయ్యాయి. ఇక శివాజీరాజా ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో శ్రీకాంత్ పోటీపడ్డారు. అయితే అతన్ని అధిగమించి ఆ స్థానాన్ని డా. రాజశేఖర్ సొంతం చేసుకున్నారు. శ్రీకాంత్‌కు 225 ఓట్లు రాగా, రాజశేఖర్‌కు 240 ఓట్లు పోలయ్యాయి. ఈయన నరేష్ ను బలపరుస్తూ అతని ప్యానల్ తరుపున పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందడం విశేషం. ఇక ఈ ఎన్నికల్లో రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ కూడా గెలుపొందడం ఆసక్తిని కలిగించింది. జనరల్ సెక్రటరీగా పోటీకి దిగిన జీవిత కమెడియప్ రఘుబాబుపై 289 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
రఘబాబుకు మాత్రం 178 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ట్రెజరర్ పదవికి పోటీపడిన రాజీవ్ కనకాల 261 ఓట్లని సాధించి కోట శంకర్‌రావుపై గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా గౌతంరాజు, శివబాలాజీ గెలుపొందారు. `మా` కార్యవర్గ సభ్యులుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేష్ కొండేటి, అనితా చౌదరి, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ విజయం సాధించారు.