నిజానికి మన ఇండస్ట్రీ వారు తీసే బయోపిక్‌లో ఎంత సేపు ముఖస్తుతితో సాగుతుంటాయి. వారు ఆయా వ్యక్తుల జీవితాలలో ఉన్న ఎత్తు పల్లాలను చూపించడానికి ఇష్టపడరు. కేవలం వారిని దేవుళ్లుగా ప్రొజెక్ట్ చేయడమే కర్తవ్యంగా భావిస్తారు. అదేమంటే బయోపిక్‌లు ఎవరిపై అయితే తీస్తున్నారో ఆ వ్యక్తి జీవితంలోని వివాదాస్పద అంశాలను పొందుపరిచేంత దమ్ము మన వారికి లేదు. ఇక సిల్క్‌స్మిత, మహానటి సావిత్రిల జీవితంలో ఎత్తుపల్లాలు, అనుకోని ఊహించని సంఘటనలు ఉన్నాయి కాబట్టే అవి బాగా ఆడాయని వాదిస్తారు. మరి ఎన్టీఆర్ జీవితంలో ఎత్తుపల్లాలు, ఇతర భావోద్వేగ అంశాలు లేవా? అంటే ఉన్నాయి. స్టార్ హీరోగా మారిన విధానం, సాటి హీరోయిన్లతో ఆయన ప్రేమను చూపించిన విధానం, నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం, కుటుంబ సభ్యులు వారించడం, అయినా ఎన్టీఆర్ మొండిగా వివాహం చేసుకోవడం, చివరలో లక్ష్మీపార్వతి బూచిని చూపి చంద్రబాబు, ఎన్టీఆర్‌ని పదవీచితుడిని చేయడం వంటి ఎన్నో కీలకాంశాలు ఉన్నాయి.
ఇక నాగార్జున కూడా సుమంత్‌తో తన తండ్రి ఏయన్నార్ బయోపిక్ తీయాలని భావించి, ఆ తర్వాత తన తండ్రి జీవితంలో డ్రామా లేదని, ఫ్లాట్‌గా సాగుతుందని చెప్పి తప్పుకున్నాడు. ఇప్పుడు పలువురు మెగాస్టార్ అభిమానులు చిరంజీవి బయోపిక్ తీయాలని, దానిని చరణ్ చేస్తేనే బాగుంటుందని అంటున్నారు. చిరు చిన్నస్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదిగాడని, ఆయన బయోపిక్ వస్తే ఎంతో మందికి అది స్ఫూర్తి దాయకంగా ఉంటుందని వారి వాదన.
కానీ ఈ వాదనను నాగబాబు ఖండించాడు. ఆయన మాట్లాడుతూ, అన్నయ్య జీవితం మీద బయోపిక్ తీసే ఉద్దేశ్యమే లేదు. నాకే కాదు.. చరణ్‌కి కూడా ఉండదని భావిస్తున్నాను. చరణ్ ఆ ఆలోచన చేస్తాడని నేను అనుకోవడం లేదు. అన్నయ్య జీవితం బయోపిక్‌కి సెట్ కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సినిమా అంటే అప్ అండ్ డౌన్స్, సంతోషం, దుఖం అన్ని ఉండాలి.
కానీ అన్నయ్య జీవితంలో అవేమీ లేవని అన్నాడు. అయినా చిరంజీవి హీరోగా ఎదిగిన విధానం, కెరీర్ ప్రారంభంలో కొన్ని అడల్ట్ చిత్రాలలో సైతం నటించిన అంశాలు, నాటి హీరోయిన్లతో ఆయన ఎఫైర్స్, అల్లుకి అల్లుడు కావడం, సుధాకర్, నారాయణరావు వంటి స్నేహితులతో వచ్చిన విభేధాలు, చాలాకాలం మేకప్ వేసుకోకుండా ఉండటం, రాజకీయాలలోకి ఎంటర్ అయి రాణించలేక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, వ్యక్తిగత జీవితంలో కుమార్తెల విషయం, ఉదయ్‌కిరణ్, శిరీష్‌భరద్వాజ్ ఎపిసోడ్స్ ఇలా చిరు బయోపిక్‌ని నిజాయితీగా తీయాలంటే చాలానే ఉన్నాయి. కానీ నాగబాబు మాత్రం చిరు జీవితంలో ఏ ఎత్తుపల్లాలు లేవని చెప్పడం సరికాదు.