ఒక డైరెక్టర్‌లోని టాలెంట్‌ని గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చే నిర్మాతలకు ఆయా దర్శకులతో వరుస చిత్రాలను చేయాలనే ఆశ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ దర్శకుడికి బ్రేక్‌నిచ్చింది ఆ నిర్మాతే కాబట్టి ఇందులో తప్పుపట్టేందుకు ఏమీ లేదు. ఇలా గతంలో పలు చిత్రాల నిర్మాతలు ఒకే హీరో, లేదా దర్శకులతో చిత్రాలు తీసేవారు. ఎస్.గోపాల్‌రెడ్డి, కోడిరామకృష్ణతో, దేవివరప్రసాద్, విజయబాపినీడు వంటి వారు చిరంజీవికే పరిమితం అయ్యారు. ఇక యండమూరి, సత్యానంద్, కె.యస్.రామారావు, కోదండరామిరెడ్డి ఇలా ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ కోవకి చెందిన నిర్మాతే దిల్‌రాజు.
ఈయన బొమ్మరిల్లు భాస్కర్‌ని పరిచయం చేసి ‘బొమ్మరిల్లు’తో పాటు ‘పరుగు’ చిత్రాన్ని కూడా నిర్మించాడు. శ్రీకాంత్ అడ్డాలను ‘కొత్త బంగారులోకం’తో పరిచయం చేసి తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ నిర్మించాడు. ఇదే కోవలోకి వంశీపైడిపల్లి, సతీష్ వేగేశ్న వంటి వారు కూడా వస్తారు. ఇప్పుడు అనిల్‌రావిపూడి వంతు వచ్చింది. అనిల్ రావిపూడి కళ్యాణ్‌రామ్ హీరోగా తీసిన ‘పటాస్’ చిత్రం ద్వారా దిల్‌రాజు భారీ లాభాలు సంపాదించాడు. తర్వాత ‘సుప్రీం, రాజా దిగ్రేట్’ చిత్రాలను నిర్మించాడు.
తాజాగా అనిల్‌తో దిల్‌రాజు తీసిన ‘ఎఫ్ 2’ చిత్రం కనకవర్షం కురిపించింది. దాంతో అనిల్‌రావిపూడిని దిల్‌రాజు మూడు సినిమాలకు లాక్ చేశాడట. అనిల్ దర్శకత్వంలో దిల్‌రాజు - అనిల్‌సుంకరలు నిర్మించే చిత్రంతో పాటు ‘ఎఫ్ 2’ కి సీక్వెల్‌ని కూడా 2021లో నిర్మిస్తామని దిల్‌రాజు చెప్పుకొచ్చాడు. ఇలా దర్శకులనే కాదు.. హీరోలను, సాయిపల్లవి వంటి హీరోయిన్లను కూడా లాక్ చేయడంలో దిల్‌రాజు చాతుర్యం అద్భుతమనే చెప్పాలి. ఏదిఏమైనా సినిమా అనేది భారీ డబ్బుతో కూడిన వ్యాపారం కాబట్టి ఈ మాత్రం ముందు జాగ్రత్త, తాను నమ్మిన దర్శకులను వదలకుండా చేయడం అనేవి సహజమేనని చెప్పాలి.