సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం తయారుచేసుకున్న కథలు చివరికి వేరే వారికి వెళ్తూ ఉండటం సహజమే. అయితే అలా ఒకరు రిజెక్ట్ చేసిన కథను మరొకరు ఒప్పుకునే ముందు అసలు ముందు హీరో ఎందుకు ఆ కథను రిజెక్ట్ చేశాడు? అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. లేకపోతే దారుణమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇలాంటి విషయాలలో స్టార్స్ మరింత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది.
ఇక విషయానికి వస్తే స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీకి చాన్స్ ఇస్తానని మొదట ప్రకటించింది జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన మాత్రం ఆయనకు దర్శకునిగా అరంగేట్రం ఇచ్చే చాన్స్ ఇవ్వలేదు. ఎంతోకాలం ఎన్టీఆర్ కోసం ఎదురు చూసిన ఆయన ఎన్టీఆర్ కోసం తయారు చేసుకున్న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ స్టోరీకి నో చెప్పడం.... వెంటనే అల్లుఅర్జున్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. కానీ ఫలితం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇప్పుడు బన్నీ మరోసారి అదే తప్పు చేస్తున్నాడా? అనేది టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది.
మొదట సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో మహేష్‌బాబు 26వ చిత్రాన్ని తీయనున్నామని అఫీషియల్‌గా ప్రకటించడమే కాదు.. పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఏ స్టోరీతో కూడా సుక్కు, మహేష్‌ని మెప్పించలేకపోయాడు. అదే సమయంలో సుక్కుకి బన్నీ ఆపద్బాంధవుడిగా కనిపించాడు. మహేష్ కోసం అనుకున్న ఓ స్టోరీని ఆయన బన్నీకి చెప్పి ఒప్పించుకున్నాడు. అల్లుఅర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల చిత్రం పూర్తయిన తర్వాత సుకుమర్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటించే మైత్రి మూవీ మేకర్స్ మూవీ ప్రారంభం కానుంది.
ఇలా మహేష్ ఆ చిత్రాన్ని ఎందుకు వదిలేశాడు? అనే కోణంలో ఆలోచించకుండా అల్లుఅర్జున్ నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇదైనా బన్నీకి మంచి విజయాన్ని అందిస్తుందా? ఈ కథను ఒప్పుకుని బన్నీ మంచి పని చేశాడా? ఈ కథను రిజెక్ట్ చేయడం ద్వారా మహేష్ మంచి పని చేశాడా? లేదా తప్పు చేశాడా? అనేవి సినిమా పూర్తి అయి విడుదలైతే గానీ తెలియదనే చెప్పాలి.