తాజాగా తెలుగుదేశం అధికార ప్రతినిధి సాధినేని యామిని పవన్ గురించి, జనసైనికుల గురించి తప్పుగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో సాధినేని యామినిపై పవన్‌కళ్యాణ్ మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ, నాపై వ్యక్తిగత విమర్శలు చేశావు. మా కార్యకర్తలను అరెస్ట్ చేయించావు అంటూ ఘాటుగా ప్రశ్నించారు. యామినిపై సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టారన్న విషయంలో జనసైనికులు కొందరిని పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేశారు. ఈ సందర్భంగా పవన్ టిడిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, నాడు మీ జెండాలను మోసిన వారిపైనే కేసులు పెట్టి చచ్చేలా కొడతారా? నేను చాలా గౌరవంగా మాట్లాడుతాను. అందులో తప్పులుంటే ఖండించాలి. అంతేగానీ వ్యక్తిగత జీవితంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. అసలు నా వ్యక్తిగత జీవితం గురించి వారికేం తెలుసు? నన్ను విమర్శించేంత విలువలు మీకు ఉన్నాయా? నన్ను విమర్శించినందుకు సమాధానంగా మా జనసైనికులు ఒక మాట అంటేనే చచ్చేలా కొడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు.
అయినా ఇటువంటి గొడవలకు నేను భయపడే రకం కాదు. మీరు హద్దులు దాటితే మేము కూడా హద్దులు దాటాల్సివస్తుంది. నేను ఏం మాట్లాడినా అందులో వాస్తవం ఉంటుంది. సర్పంచ్‌గా పోటీ చేయని వ్యక్తి మంత్రి అయ్యాడంటే దానిలో వాస్తవం ఉంది. ఇది 2009 కాదు.. 2019 అని గుర్తుపెట్టుకోండి. నా కార్యకర్తలపై పెట్టిన కేసులను మర్యాదగా ఉపసంహరించుకోవాలి. లేదంటే యుద్దం తప్పదని పవన్ టిడిపి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఇక పవన్ ఈసారే తాము అధికారంలోకి వస్తామని చెప్పడం లేదు. కేవలం ఈసారి ఎన్నికల్లో గెలవాలని, లేదంటే వెళ్లిపోతామనే వారు నా పార్టీలోకి రావాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి నా పార్టీలో చోటు లేదు. నేను ముఖ్యమంత్రిని కావడానికి 20ఏళ్లయినా ఎదురుచూస్తానని పవనే స్వయంగా చెబుతున్నాడు.
అంటే ప్రస్తుతం ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతాడనే ఉద్దేశ్యంలో లేడు. భారీ విజన్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. తనకి ఓ పది సీట్లు వచ్చినా కూడా ఓట్ల శాతంగా తన బలం ఎంత ఉంది? అని తేల్చుకునే పనిలో పవన్ ఉన్నాడు. దాదాపు రాష్ట్రంలోని 20 నుంచి 25 శాతం ఓట్లను ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో చంద్రబాబు ఈ మధ్య పవన్‌కి మరలా కలుద్దామని ఆఫర్ ఇచ్చినా పవన్ నో చెప్పాడు. ఒంటరిగానే పోటీ చేద్దాం. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటానని ఆయన టిడిపి, వైసీపీలను డైలమాలో పెట్టాడు.
మరోవైపు వైసీపీ బలంగా ఉన్న స్థానాలలో టిడిపి టిక్కెట్లు ఆశించి, రాని వారంతా ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు.. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గుంపగుత్తగా వైసీపీకి వెళ్లకుండా ఆ ఓట్లను పవన్ జనసేన చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టిడిపి టిక్కెట్ల ఆశావహులు తమకు టిక్కెట్లు రాని పక్షంలో జనసేనలోకి వెళ్తుండటంతో ఇదంతా బాబు వెనుక నుంచి ఆడుతున్న డ్రామాగా కొందరు సీనియర్లు విశ్లేషిస్తూ ఉండటం గమనార్హం.