షైన్‌స్క్రీన్స్ బేనర్‌పై నిర్మాతలు సాహుగారపాటి, హరీష్‌పెద్దిలు నిర్మిస్తున్న చిత్రం ‘మజిలీ’. నిన్నుకోరి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రెండో చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఈ దర్శకుడు నిన్నుకోరి తర్వాత ‘మజిలీ’ ద్వారా ద్వితీయ విఘాన్ని అధిగమిస్తాడో లేదో ఆనే విషయం ఆసక్తిని రేపుతోంది. మరోవైపు వివాహం కాక మునుపు ‘ఏ మాయచేశావే, మనం, ఆటోనగర్ సూర్య’లలో నటించిన భార్యాభర్తలైన నాగచైతన్య-సమంతలు వివాహం తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం, ఈ చిత్రంలో కూడా వారిద్దరు భార్యాభర్తలుగానే నటిస్తూ ఉండటం విశేషం.
‘మజిలీ’ అనే టైటిల్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో క్రికెటర్‌గానే కాకుండా సాధారణ యువకునిగా కూడా చైతన్య కనిపించనున్నాడని, ఈ రెండు షేడ్స్‌లో ఆయన నటన బాగా ఉందని సమాచారం. సమంతతో పాటు మరో హీరోయిన్ నటిస్తోన్నఈ చిత్రం ఏప్రిల్5న విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే వరుసగా ‘శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి’ వంటి పరాజయాల తర్వాత చైతుకి ఇది అత్యంత కీలకమైన చిత్రం కానుంది.
ఇక ఈ మూవీ బిజినెస్ కూడా జోరుగా సాగుతోందని సమాచారం. కేవలం శాటిలైట్ హక్కులను జెమిని టీవీ 5కోట్లకు తీసుకుందని తెలుస్తోంది. డిజిటల్ హక్కులను అమేజాన్ సంస్థ 3.5కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 4కోట్లకు అమ్ముడయ్యాయట. అంటే థియేటికల్ బిజినెస్ కాకుండానే ఈ చిత్రానికి 12.5 కోట్లు వసూలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక థియేటికల్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడు పోతాయో వేచిచూడాల్సివుంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి వాటిని ఈ చిత్రం నెరవేరుస్తుందా? లేదా? అనేది తెలియాంటే ఏప్రిల్ 5వరకు ఎదురు చూడాల్సిందే.....!