మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్, సుప్రీం చిత్రాలతో ఏకంగా దిల్‌రాజు పెద్దరికంతో మూడు చిత్రాల ద్వారానే 25కోట్ల మార్కెట్‌ని దక్కించుకున్నాడు. కానీ వాటిని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన మొదటి చిత్రంగా ప్రారంభమై చాలా ఆలస్యంగా విడుదలైన వైవిఎస్ చౌదరి రేయ్ నుంచి ఈయనకు వరుసగా అరడజను డిజాస్టర్స్ వచ్చి ఫ్లాప్‌లలో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ సమయంలో ఆయన కృష్ణవంశీ, వినాయక్, కరుణాకరన్ వంటి పెద్ద డైరెక్టర్స్‌తో పనిచేసినా లాభం లేకుండా పోయింది. కాగా ప్రస్తుతం ఆయన ఆశలన్నీ మైత్రి మూవీమేకర్స్ సంస్థలో నేను..శైలజ, ఉన్నది ఒక్కడే జిందగీ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘చిత్రలహరి’పైనే ఉంది. ఈ చిత్రంతో తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం చెబుతానని ఓపెన్‌గానే సాయిధరమ్‌తేజ్ ఛాలెంజ్ చేశాడు.
ఇక ఈ మూవీకి మొదట 20కోట్ల బడ్జెట్‌ని కేటాయించిన మైత్రి సంస్థ ఆ తర్వాత ఆ బడ్జెట్‌ని కేవలం 12 కోట్లకే పరిమితం చేసిందని వార్తలు వచ్చాయి. అందునా డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్‌లో ఉన్న తేజు, పెద్దగా పేరులేని కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ వంటి హీరోయిన్లు, ఉన్నది ఒకటే జిందగీ వంటి ఫ్లాప్‌ని తీసిన కిషోర్ తిరుమల, సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని వంటి ఫ్లాప్స్‌లను మూటగట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్ చిత్రం కావడంతో ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బన్నీ-సుకుమార్‌లతో తాము చేయబోయే చిత్రాన్నిచూపించి మైత్రి సంస్థ ఈ చిత్రం బిజినెస్‌ని జరిపించడానికి ప్లాన్ చేస్తోందన్న వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ చిత్రానికి జరుగుతున్న ప్రీరిలీజ్ బిజినెస్ చూసి అందరు నోరు వెళ్లబెడుతున్నారు. కేవలం థియేటికల్ బిజినెస్ 10కోట్లు జరగడమే కష్టం అనుకుంటున్న తరుణంలో అందరికీ షాకిస్తూ ఈ చిత్రం 15కోట్ల వరకు ప్రీరిలీజ్ థియేటికల్ బిజినెస్ చేసిందని సమాచారం. అందునా ఈ చిత్రాన్ని నైజాంలో దిల్‌రాజు తీసుకోవడం మరింత ఊపునిచ్చే విషయమే. ఉత్తరాంధ్ర గాయత్రీ దేవి ఫిల్మ్స్, కృష్ణలో క్రేజీ మూవీ మేకర్స్‌లు ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. కాగా ఈమూవీ సాయిధరమ్‌తేజ్, కిషోర్ తిరుమలలతో పాటు మైత్రి మూవీ మేకర్స్‌కి కూడా ఎంతో కీలకచిత్రమనే చెప్పాలి.