సినిమారంగంలో ఓ హీరో, దర్శకునితో అనుకున్న చిత్రాలు వేరొక్కరితో ముందుకు సాగడం సహజమే. అదే స్టార్ హీరోల చిత్రాలైతే ఇవి బాగా చర్చనీయాంశం అవుతాయి. ఇక విషయానికి వస్తే కొంతకాలం కిందట తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్‌లో వెంకటేష్ హీరోగా ‘ఆటా నాదే.. వేటా నాదే’ అనే చిత్రం పట్టాలెక్కాల్సింది. కానీ చివరి నిమిషాలలో ఇది రద్దయింది. ఈ స్థానంలోకి వెంకీ దిల్‌రాజు, అనిల్‌రావిపూడిల ఎఫ్2లోకి వచ్చాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇక తేజ బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కి దర్శకునిగా ఎంపికయ్యాడు. నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో అంగరంగ వైభవంగా ఓపెనింగ్ జరిగింది. కానీ ఆ చిత్రం నుంచి తేజ బయటకు రాగా, మణికర్ణిక నుంచి బయటకు వచ్చిన క్రిష్ చేతికి ఈ చిత్రం పగ్గాలు అందాయి.
ఇక తాజాగా మహేష్‌బాబు విషయానికి వస్తే ఆయన సుకుమార్‌తో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై 1 (నేనొక్కడినే) చిత్రం తర్వాత రెండో సినిమాకి చాన్స్ లభించింది. ఈ చిత్రం పట్టాలెక్కే సమయంలో ఈ మూవీ రద్దయింది. ఈ స్థానంలోకి మరలా దిల్‌రాజు ఎంటర్ అయ్యాడు. అనిల్‌రావిపూడితో కలిసి మహేష్ చిత్రాన్ని నిర్మించే బాధ్యతలు పొందాడు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, సుకుమార్‌లు ఆర్య, ఆర్య2 తర్వాత మరలా మూడో చిత్రంగా బన్నీతో చిత్రం చేయనున్నారు.
మరి అనిల్‌రావిపూడితో మహేష్ చిత్రం, సుకుమార్‌తో బన్నీ చిత్రాలు పూర్తయి రిలీజై వాటి రిజల్ట్ తెలిస్తే ఎవరు అదృష్టవంతులు? ఎవరి చిత్రం ఎక్కువ విజయం సాధిస్తుంది? అనే అంశాలపై క్లారిటీ రానుంది. మరి సుక్కుని వదులుకుని మహేష్ తప్పు చేశాడా? లేక అనిల్‌రావిపూడిని రంగంలోకి దింపి మంచి పని చేశాడా? అనేవి తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదనే చెప్పాలి.