శివాజీరాజా పదవీకాలం ముగియడంతో `మా` ఎన్నికలు త్వరలో జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ పోటీపడుతున్నాయి. ఈ రెండు ప్యానెల్‌లకు సంబంధించిన సభ్యులు ఎన్నికలు సమీపిస్తుండటంతో హంగామా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో ..ఎవరిని కలవాలో కూడా వారికి తెలియడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. పోటీలు పడి మరీ ఎప్పుడూ కలవని వారిని కూడా కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. పొట్టి వీరయ్యను కన్నెత్తి చూడని వారు కూడా స్వయంగా ఇంటికి వచ్చి అతనితో సెల్ఫీలకు పోజులిస్తున్నారు.
ఇదిలా వుంటే శివాజీ రాజా ప్యానెల్ గత ఎన్నికల్లో గెలవడానికి ప్రధానంగా మద్దతు తెలిపిన చిరంజీవిని ఈ రెండు ప్యానెల్‌లకు సంబంధించిన టోటల్ టీమ్ అంతా ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి కలిసింది. ముందు నరేష్ ప్యానెల్ మహేష్‌బాబు, ప్రభాస్‌ని కలిసి మద్దతుగా నిలవమని కోరారు. ఆ తరువాత చిరంజీవిని కలవడానికి మొత్తం యాభై మంది మందగా వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన చిరు వాచ్‌మెన్ సార్ లేరని చెప్పడంతో చిరంజీవికి ఇవ్వాల్సిన బొకేను నీకే ఇస్తున్నాం. తీసుకో..ఇంట్లో వుండి కూడా నీతో లేడని చెప్పిస్తున్నాడని హంగామా చేశారు.
దాంతో ఈ పెంట నాకు చుట్టుకునేలా వుందని భయపడ్డారో ఏమోగానీ మరుసటిరోజు రమ్మని చిరు కబురు చేశారట. దాంతో నరేష్ ప్యానల్‌కు చెందిన సభ్యులంతా చిరు ఇంట్లో చిటికెలో వాలిపోయి తమకే చిరు మద్దతు అంటూ ఫొటోలతెగ పోజులిచ్చేశారు. `మా` ఎన్నికల్లో చిరు ఎవరికి మద్దతుగా నిలుస్తాడో అందరికి తెలిసిందే. శివాజీరాజా, శ్రీకాంత్ ఏ ప్యానల్‌లో వుంటే ఆ ప్యానల్‌కే చిరు మద్దతు వుంటుందన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం నరేష్ వర్గానికి కూడా తెలుసు. తెలిసి తెలిసి చిరంజీవిని ఆటపట్టిద్దామనే అంతా కూడబలుక్కుని ఆయన ఇంటికి మద్దతు కోసం వెళ్లారని, తొలుత సెక్యూరిటీ నిరాకరించడంతో ఆ ఫోటోలనే ప్రచారం కోసం వాడుకోవాలని పెద్ద ప్లానే వేశారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. `మా` రాజకీయమా మజాకా మరి.