తన కెరీర్ మొదట్లో పలు చిత్రాలలో జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి పాత్రలు, టివీ సీరియల్స్‌లో కూడా నటించాడు హీరో నిఖిల్ సిద్దార్ద్. ఆయనకు హ్యాపీడేస్, యువత వంటి హిట్స్ వచ్చినా ఆయన హవా మొదలైంది మాత్రం స్వామిరారాతోనే. ఆ వెంటనే కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో సంచలనం సృష్టించాడు. ఈ సమయంలో ఆయనకు ఎదురైన ఒకే ఒక్క ఫ్లాప్ శంకరాభరణం మాత్రమే. అయితే ఆయన ఎన్నో ఆశలతో చేసిన కేశవ జస్ట్ ఓకే అనిపించింది. కన్నడ బ్లాక్‌బస్టర్ కిర్రాక్ పార్టీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కిర్రాక్ పార్టీ తర్వాత నిఖిల్ మరో రీమేక్ చేస్తున్నాడు.
తమిళంలో సూపర్‌హిట్ అయిన కణితన్‌కి ఇది రీమేక్. ఒరిజినల్ దర్శకుడు సంతోషే దీనికి సైతం దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట ఈ మూవీకి ముద్ర అనే టైటిల్‌ని పెట్టినా ఆ టైటిల్‌ని వేరే వారు రిజిష్టర్ చేయించడంతోపాటు ఆ చిత్రం నిఖిల్‌దేనని టిక్కెట్ల బుకింగ్ కూడా జరగడం వివాదానికి కారణమైంది. అయినా కంటెంట్‌ని నమ్ముకున్న వాడికి టైటిల్‌తో పనేమిటి అన్నట్లు ఈ మూవీకి ఇందులో నిఖిల్ పాత్ర పేరైనా అర్జున్ సురవరం అని ఫిక్స్ చేశారు. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన టీజర్‌కి సోషల్‌మీడియాలో అద్భుత ఆదరణ లభిస్తోంది. కేవలం 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఈ టీజర్ చూసిన వారికి ఇది రొటీన్ చిత్రం కాదని, ఏదో సమ్‌థింగ్ స్పెషల్ అనే ఆసక్తి కలుగుతోంది.
తెలుగులో జర్నలిజం మీద వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. ఒకనాడు మలయాళం నుంచి రీమేక్‌గా కృష్ణంరాజు అంతిమ తీర్పు వచ్చింది. అప్పుడెప్పుడో కెమెరామెన్ గంగతో రాంబాబు వంటివి వచ్చినా మెప్పించలేకపోయాయి. తమిళంలో వచ్చిన చదరంగం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ వస్తోంది. ఇందులో నేటి మీడియా తీరు తెన్నులు, టీఆర్పీల మాయాజాలం, బిబిసిలో పనిచేసే సిన్సియర్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ సురవరంగా నిఖిల్, ఆయనకు జోడీగా లావణ్యత్రిపాఠి ఆకట్టుకుంటున్నారు. ‘ఓ అబద్దాన్ని నిజం చేయడం సులభం.. కానీ ఓ నిజాన్ని నిజం అని నిరూపించడం కష్టం’ అనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇక ఇందులో నిఖిల్ గ్రేస్‌ని చూసిన మెగాస్టార్ చిరంజీవి నిఖిల్‌పై పొగడ్తలు కురిపించాడట.
దీనిపై నిఖిల్ మాట్లాడుతూ, ఈ చిత్రం టీజర్ విడుదలైన తర్వాత పలువురి నుంచి మా నిర్మాత ఫోన్‌కి అభినందనలు వస్తున్నాయి. కానీ ఒక అభినందన చదివిన ఆయన ఎంతో సంబరపడి పోతున్నాడు. దాంతో అది ఎవరిదా? అని ఫోన్ లాక్కుని చూశాను. అది మెగాస్టార్ చిరంజీవి గారి అభినందన.. ఇప్పుడే ‘అర్జున్ సురవరం టీజర్ చూశాను. చాలా ఆసక్తికరంగా ఉంది. మీకు, నిఖిల్‌కి ఆల్‌ది బెస్ట్ అని మెగాస్టార్ మెసేజ్ పెట్టారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను... అంటూ చిరు మెసేజ్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని నిఖిల్ షేర్ చేశాడు’. మొత్తానికి విజయ్ దేవరకొండ, నిఖిల్, నాగశౌర్య, శర్వానంద్ వంటి వారిని చిరు బాగా ప్రోత్సాహిస్తున్నాడనే చెప్పాలి.