మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. గత ఏడాది జూన్ లో సెట్స్ మీదకెళ్ళిన మహర్షి సినిమాని మేకర్స్ ముందుగా ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ షూటింగ్ లో జాప్యం వలన ఆ విడుదల తేదీ కాస్తా ఏప్రిల్ 25 కి మారింది. ఏప్రిల్ 25 న విడుదల ఖచ్చితంగా ఉంటుందని.... మహేష్ బాబు దిల్ రాజుతో ఆ డేట్ ఇప్పించాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ 25 నే మహర్షి మూవీ విడుదల అంటూ కన్ఫర్మ్ చేసిన టీం తాజాగా మరో కొత్త డేట్ ఇచ్చింది.
ఏప్రిల్ 15 వరకు మహర్షి షూటింగ్ జరుగుతుంది కాబట్టి.. కేవలం పది రోజుల్లో సినిమాని విడుదల చెయ్యడం అంటే పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ కి టైం సరిపోదని.. అందుకే మహర్షి విడుదల డేట్ మారొచ్చంటూ ఈ రోజు ఉదయం నుండి అనేకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఏప్రిల్ 25 నుండి మహర్షి మే కి వెళ్ళిందంటూ న్యూస్ లు కుప్పలు తెప్పలుగా మీడియాని చుట్టేశాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న మహర్షి టీం వెంటనే మహర్షి సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది. మహర్షి నిర్మాత దిల్ రాజు స్వయానా మహర్షి సినిమా మే 9 న విడుదల అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. మరి రెండుసార్లు వాయిదా పడి మూడోసారి విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది మహర్షి మూవీ.