టాలీవుడ్‌లో మంచి టాలెంట్‌తో పాటు సరైన ప్లానింగ్ ఉన్న యంగ్ హీరోగా శర్వానంద్‌కి పేరుంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి ఆయన కెరీర్ సాగుతోంది. మొదట్లో ‘యువసేన, గౌరీ, శంకర్‌దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి’ వంటి చిత్రాలలో కీలకపాత్రలను పోషించాడు. ఆ తర్వాత ఈయన కెరీర్‌ని మలుపుతిప్పిన చిత్రాలుగా ‘వెన్నెల, అమ్మ చెప్పింది, ప్రస్థానం’ వంటి వాటిని చెప్పవచ్చు. ‘గమ్యం, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి, మహానుభావుడు’ వంటి హిట్ చిత్రాలతో హీరోగా తనకంటూ గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. ‘రాధా, పడి పడి లేచె మనసు’ చిత్రాలు దెబ్బతీశాయి.
ఇక ఒక స్థాయికి వచ్చిన హీరోలు కథాపరమైన టైటిల్‌ని గానీ లేదా ఆయా హీరోల పాత్రలకి తగ్గ టైటిల్స్‌ని గానీ పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. దీనికి సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రమే మినహాయింపు. ఆయన ‘సంక్రాంతి, ఘర్షణ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి టైటిల్స్‌ని కూడా ఒప్పుకుని విజయం సాధించాడు. తాజాగా శర్వానంద్ కూడా అదే దారిలో నడుస్తున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సుధీర్‌వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని, ఒకటి యంగ్ పాత్ర కాగా, మరోటి సాల్ట్ పెప్పర్, గడ్డం లుక్‌లో ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ శర్వానంద్ 27వ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని వదిలారు. పెయింట్‌లా అనిపించే పోస్టర్‌లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కాకుండా కాస్త స్టైలిష్‌గానే, సూట్, కూలింగ్ గ్లాస్‌లతో శర్వానంద్ గడ్డం లుక్‌తో కనిపిస్తున్నాడు.
మేలో విడుదల కానున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శినిలు నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ఏమిటో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఆయన త్వరలో ‘శతమానం భవతి’ తర్వాత దిల్‌రాజు బేనర్‌లో తమిళ ‘96’ రీమేక్‌లో జాయిన్ కానున్నాడు. తమిళంలో విజయ్‌సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో శర్వానంద్, సమంతలు నటిస్తున్నారు. తమిళ ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘96’ సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో టైం ఫ్రేమ్ ఆధారంగా ఈ మూవీకి ‘96’ అని టైటిల్ పెట్టారు. కానీ తెలుగులోకి వచ్చే సరికి హీరోయిన్ సమంత పేరు మీద టైటిల్‌ని పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
‘జాను’, ‘జాను అలియాస్ జానకి’ అనే టైటిల్స్‌ని పరిశీలించిన యూనిట్ ఎట్టకేలకు ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ని లాక్ చేశారట. ఈ మూవీలో హీరోయిన్ సమంత గాయని ఎస్.జానకికి వీరాభిమాని. ఆమె పాటలు పాడుతూ ఉంటుంది. కాబట్టే దీనికి ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తనకంటూ మంచి మార్కెట్ ఉన్న శర్వానంద్ హీరోయిన్ పేరు మీద వచ్చే టైటిల్‌ని అంగీకరించడం అనేది ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుందనే చెప్పాలి.