మైత్రి మూవీ మేకర్స్.. ఈ సంస్థ అతి తక్కువ చిత్రాలతోనే తనకంటూ ఓ గుడ్‌విల్‌ని సాధించింది. ఎప్పటి నుంచో ఉన్న అల్లు అరవింద్, దిల్ రాజు, దానయ్య వంటి నిర్మాణ సంస్థల సరసన చోటు సాధించింది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సంస్థల్లో యువి క్రియేషన్స్‌తో పాటు పోటీ పడుతున్నది ఈ సంస్థేనని చెప్పాలి. వీరు తీసిన మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్ ‘జనతాగ్యారేజ్’, రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’ అయితే ‘నాన్-బాహుబలి’ రికార్డులను తిరగరాసింది. అయితే పెద్ద స్టార్స్‌తో వీరు తీసిన ఈ మూడు చిత్రాలు అద్భుతంగా ఆడాయి గానీ కొద్ది స్థాయి తక్కువ హీరోలైన మాస్ మహారాజా రవితేజతో తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’, నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రాలు బాగా నష్టాలను మిగిల్చాయి.
అదే సమయంలో ప్రస్తుతం మైత్రి మూవీమేకర్స్ సంస్థ వరుస డిజాస్టర్స్‌లో ఉన్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రం తీస్తోంది. ఈ చిత్రానికి సాయిధరమ్‌తేజ్ వల్ల గానీ, హీరోయిన్లు, ఇతర విషయాల పరంగా గానీ బిజినెస్ బాగా అయ్యే అవకాశాలు లేవు. సినిమా ఎంత బాగా వచ్చిందని చెప్పినా ఎగబడి కొనే బయ్యర్లు ఉంటారని అనుకోలేం. అక్కడే మైత్రి సంస్థ తన స్ట్రాటర్జీని చూపించదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం విడుదలకు ముందే పెద్ద స్టార్స్‌తో తాము చేయబోయే చిత్రాలను ఈ సంస్థ చూపించుకుంటే ఆయా చిత్రాల కోసమైనా బయ్యర్లు ‘చిత్రలహరి’ని కొనేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో సుకుమార్-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో మహేష్ 26వ చిత్రం తమ సంస్థలోనే ఉంటుందని మైత్రి సంస్థ ఎప్పుడో ప్రకటించింది. కానీ ఈ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్న విషయం మీడియాకు లీకైంది.
దాంతో ఈ నిర్మాతలు వేగంగా పావులు కదిపారు. ఇప్పటికీ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల చిత్రం కూడా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ మైత్రి వారు మాత్రం ఆ తరువాత బన్నీ చేసే చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తమ సంస్థలోనే ఉంటుందని హడావుడి చేసి మొత్తానికి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సో.. బన్నీని అడ్డుపెట్టుకుని సాయిధరమ్‌తేజ్ ‘చిత్రలహరి’ని మార్కెట్ చేసుకోవడం కోసమే ఇంత వేగంగా మైత్రి సంస్థ స్పందించిందనేదే అసలైన కారణమని టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇందులో నిజం కూడా ఉందనే అనిపిస్తోంది కదూ....!