సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన `ఫిదా` సినిమాతో హంగామా చేసిన సాయిపల్లవి తొలి సినిమాలో తను పోషించిన భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుని ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ తనవైపు తిరిగి చూసేలా చేసుకుంది. అయితే ఆ తరువాత చేసిన సినిమాలేవీ సాయి పల్లవి నటనకు తగ్గ విజయాల్ని దక్కించుకోలేకపోయాయి. ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన `పడి పడి లేచే మనసు` పేరుకుతగ్గట్టే బాక్సీఫీస్ వద్ద పడి పడి మళ్లీ లేవలేక చతికిల పడిపోయింది.
ఈ సినిమా తరువాత `నీది నాది ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కించడానికి సిద్ధమవుతున్న చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. `ఫిదా` చిత్రంలో తెలంగాణ స్లాంగ్‌తో అదరగొట్టిన ఈ తమిళసోయగం వేణు ఊడుగుల చిత్రంలోనూ అదే తరహాలో మరో సారి రెచ్చిపోనుందట.ఈ సినిమాలో ఏకంగా నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్న సాయిపల్లవికి తాజాగా మరో గోల్డెన్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ ఆఫర్ ఎవరి సినిమాలో కాదు ఏకంగా ప్రిన్స్ మహేష్‌బాబు సినిమాలో. `ఎఫ్2`తో మాంచి జోష్ మీదున్న అనిల్ రావిపూడి ఇటీవల మహేష్ టైమింగ్‌కి తగ్గ కథ చెప్పాడు. దీనికి దిల్ రాజు సోలో నిర్మాత. ఇందులో మహేష్‌కి జోడీగా సాయిపల్లవిని అడిగారట.
చెన్నై వెళ్లి ఆమెకు అనిల్ రావిపూడి కథ చెప్పాడని, స్టోరీతో పాటు తన పాత్ర చిత్రణ నచ్చడంతో సాయిపల్లవి ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే `మహర్షి` తరువాత అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కుతుందని తాజాగా వినిపిస్తోంది. మహేష్ నటిస్తున్న `మహర్షి` ఏప్రిల్ 25న రాబోతోంది. ఆ తరువాతే అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కే అవకాశం వుందని దిల్ రాజు కాంపౌండ్ టాక్. `పడి పడి లేచే మనసు` ఫ్లాప్ తరువాత మహేష్ పక్కన నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం నిజంగా ఆమెకిది గోల్డెన్ ఆఫరే కదా!.