‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అయిన తర్వాత బోయపాటి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అతిగా చూపించిన హీరోయిజం, కథలో దమ్ము లేకపోవడంతో ఆయనపై ఎన్నడు లేని విధంగా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో బాలయ్య సైతం కనీవినీ ఎరుగని రీతిలో తన తండ్రికి నివాళి అని తెరకెక్కించిన స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ‘కథానాయకుడు, మహానాయకుడు’ దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. ఈ నేపధ్యంలో బోయపాటి వెంటనే బాలయ్యతో సినిమా చేస్తాడని పలువురు భావించారు. కానీ ఎన్నికల హడావుడి మొదలు కావడంతో ఎన్నికలై ఫ్రీ అయ్యే దాకా బాలయ్య ఈ చిత్రానికి డేట్స్ కేటాయించే పనిలేదు. బహుశా జూన్ నెలలో గానీ ఈ చిత్రం పట్టాలెక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. అంతకాలం వెయిట్ చేయడం మినహా మరో దారి లేదు.
ఇంకోపక్క తాను నిర్మాతగా మారిన మొదటి రెండు పార్ట్‌లు దారుణంగా దెబ్బతీయడంతో బోయపాటి చిత్రానికి బయటి నిర్మాతలను చూసుకోమని బాలయ్య, బోయపాటికి చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బోయపాటి బిజీ బిజీ అనుకోకండి.. ఆయనకు ఆపద్భాంధవుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించాడు. ఎన్నికల ప్రచారాలలో సినీ దర్శకులను తీసుకుని ప్రచార చిత్రాలు తీయడంలో చంద్రబాబు ముందుంటాడు. నాటి కాలంలో ఎన్టీఆర్ దాసరి, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని ఆశ్రయిస్తే... చంద్రబాబు ఈవీవీ సత్యనారాయణ, రాఘవేంద్రరావులపై ఆధారపడే వాడు.
ప్రస్తుతం ఆయన బోయపాటి, అల్లరి రవిబాబులకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కృష్ణ పుష్కరాల విషయంలో కూడా బోయపాటి, ఆ తర్వాత అమరావతి డిజైన్లలో రాజమౌళిల సాయం తీసుకున్న చంద్రబాబు ప్రస్తుతం బోయపాటి, అల్లరి రవిబాబులకు ప్రచార చిత్రాలు బాధ్యతలు అప్పగించడంతో ఈ ఇద్దరు ప్రస్తుతం అమరావతిలో బిజీ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. మరి ప్రచార చిత్రాలను కూడా అతి లేకుండా సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా చెబితేనే ఓటర్లను ఆకర్షిస్తాయి. మరి ఈ విషయంలోనైనా బోయపాటి మెప్పిస్తాడా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది...!