గతంలో తెలుగు చిత్ర సీమకి చెందిన పలువురు దర్శకులు బాలీవుడ్‌లో కూడా చిత్రాలు తీశారు. కె.రాఘవేంద్రరావు నుంచి కె.విశ్వనాథ్ వరకు తెలుగులో హిట్టయిన తమ చిత్రాలకు రీమేక్‌లుగా వాటిని తెరకెక్కించారు. ఇక రవిరాజా పినిశెట్టి, ఈవీవీ సత్యనారాయణ, జెడి చక్రవర్తి, పూరీ జగన్నాథ్, ప్రభుదేవా, రాజ్...డికె నుంచి మరికొందరు కూడా బాలీవుడ్ గడప తొక్కారు. వీరందరిలో కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్నది రాంగోపాల్‌వర్మనే అని చెప్పాలి. కానీ రాను రాను ఆయన కూడా ఫామ్‌ని కోల్పోతున్నాడు. ఇక క్రిష్ ‘గబ్బర్’, ‘మణికర్ణిక’లు తీశాడు. ప్రస్తుతం టాలీవుడ్ మోడ్రన్ క్లాసిక్ ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని అదే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేస్తున్నాడు.
ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో క్రియేటివ్ జీనియస్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్లలో ముందు వరుసలో ఉండే పేరు సుకుమార్. ఈయన ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తూనే, తన శిష్యులను దర్శకులను చేస్తూ చిన్న చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. నిజానికి మహేష్‌బాబు 26వ చిత్రాన్ని సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో చేయాల్సి ఉన్నప్పటికీ సుక్కు తన బిజీ కారణంగా అనుకున్న సమయంలో మహేష్ మెచ్చే స్క్రిప్ట్‌ని అందించలేదని వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో సుకుమార్ బాలీవుడ్‌పై కన్నేశాడట. తనలాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ తీసే చిత్రాలు పాన్ ఇండియాగా ఉంటాయని, దాంతో అవి జాతీయ స్థాయిలో అయితేనే ఆర్ధికంగా, పేరు పరంగా కలిసి వస్తాయనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. త్వరలోనే ఈయన సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ వంటి వారిని కలవనున్నాడట.
ఇంతవరకు తాను తీసిన చిత్రాలలోని హైలెట్ సీన్స్‌తో సుక్కు ఒక ‘షోరీల్’ని సిద్దం చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ ‘షోరీల్’ని బాలీవుడ్ వారికి చూపించి చాన్స్‌లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. అయినా సుకుమార్ ప్రస్తుతం నాలుగు స్తంభాలాట, మూడు ముక్కలాట ఆడుతున్నాడు. మరి వీటిల్లో ఆయన దేనిలో రాణిస్తాడనేది తేలాల్సివుంది..!