తెలుగులో 1980-90లలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారికి గట్టి పోటీనిచ్చి, తెలుగు చిత్ర సీమకి మార్షల్‌ఆర్ట్స్‌ని తీసుకుని వచ్చిన వారిలో సుమన్ ముఖ్యుడు. ఈయన నాడు భానుచందర్‌తో పాటు పలు చిత్రాలలో తన సత్తా చాటి నాడు మల్టీహీరోల చిత్రాలకు జీవం పోశాడు. కానీ ఆయన నాడు బ్లూఫిల్మ్ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లాడు. నాన్‌బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ అయి ఆ తర్వాత చిన్నగా సినిమాల షూటింగ్స్‌కి మాత్రం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని, ‘బందిపోటు, ఉగ్రనేత్రుడు, పల్నాటిరుద్రయ్య’ వంటి పలు చిత్రాలతో కంబ్యాక్ అయినా మునుపటి రేంజ్‌ని మాత్రం అందుకోలేకపోయాడు. దాంతో నాడు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి వారే సుమన్‌ని జైలుకి పంపించి, తమకు పోటీ లేకుండా చేసుకున్నారని పలు ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ విషయంపై సుమన్ ఎన్నోసార్లు స్పందించాడు. ఇందులో చిరంజీవిది గానీ, చిరంజీవి కుటుంబ సభ్యుల పాత్ర ఏమీ లేదని ఆయన పలుసార్లు ఖండించాడు. నాడు సుమన్‌కి సూపర్‌స్టార్ కృష్ణ, కరుణానిధి వంటి వారు సాయం చేశారని కూడా అంటారు. తాజాగా మీ అరెస్ట్‌లో చిరంజీవి పాత్ర ఏమైనా ఉందా? అని మరోసారి ఆయనకు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ, నేను జైలుకి వెళ్లిన ఘటనలో చిరంజీవికి గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి సంబంధం లేదు. చిరంజీవి అంటే పడని వారు కొందరు ఈ పుకార్లను సృష్టించారు.
అప్పట్లో టివిలు, ఇంటర్నెట్‌లు లేవు. కేవలం దినపత్రికలు, మేగజైన్స్ మాత్రమే ఉండేవి. సర్క్యులేషన్ పెంచుకోవడానికి వారు ఇలాంటి రాతలు రాసేవారు. నిజానికి నాడు జరిగిన సంఘటనతో నాకెలాంటి సంబంధం కూడా లేదు. కొంతమంది స్నేహితుల కారణంగా నేను ఈ కేసులో ఇరుక్కున్నాను. ఆ సమయంలో కరుణానిధి గారు నాకెంతో సాయం చేశారని చెప్పుకొచ్చాడు. నాడు సుమన్‌కి ఎంతో మంచి స్నేహితునిగా ఉన్న నిర్మాత సి.కళ్యాణ్ కూడా గతంలో సుమన్ విషయం మాట్లాడుతూ, సుమన్ నాడు కొన్ని చెడ్డ స్నేహాలు చేశారు. వాటి మూలంగానే ఆయన ఆ కేసులో ఇరుక్కున్నాడని చెప్పిన విషయం తెలిసిందే.