ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే నిజమవుతుంటే అన్నట్లుగా ఎంతో కాలంగా విజయం కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తోన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌కి ‘పటాస్’ తర్వాత మరో డీసెంట్ హిట్ వచ్చింది. ఆయన నటించిన ‘118’ చిత్రం నాటి ‘కోకిల, చెట్టుకింద ప్లీడర్’ తరహాలోనే సాగినా గుహన్ తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సినిమా ఖచ్చితంగా లాభాల బాట పడుతుందనే నమ్మకంతో నిర్మాతలు, కళ్యాణ్‌రామ్‌లు ఉన్నారు.
ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ, గుహన్ గారు నాకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ఒప్పుకోకపోయి ఉంటే ఇప్పుడు చాలా బాధపడుతూ ఉండేవాడిని. కథలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ చిత్రంతో మరోసారి నిరూపితం అయింది. నా తమ్ముడు ఎన్టీఆర్ ఈ చిత్రం చూడగానే దీనిని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకంతో చెప్పాడు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిందే నిజమైంది. మా మీద నమ్మకంతో సినిమాని కొన్న దిల్‌రాజు గారికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపాడు. కిందటి ఏడాది ‘ఎమ్మెల్యే, నానువ్వే’ చిత్రాలతో ఆకట్టుకోలేకపోయిన కళ్యాణ్‌రామ్ ఈ ఏడాదిలో మొదటి హిట్ కొట్టాడని చెప్పాలి.
ఇక ఎక్కువగా యంగ్ దర్శకులకు, కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో ముందుండే కళ్యాణ్‌రామ్ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఈ మూవీకి ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మ దర్శకుడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే స్క్రిప్ట్‌పై విరించి వర్మ కసరత్తు చేస్తున్నాడని, ఈ చిత్రం గ్రామీణ నేపధ్యంలో సాగుతుందని తెలుస్తోంది. మేలో పట్టాలెక్కే అవకాశం ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. ఇకనుంచైనా కళ్యాణ్‌రామ్ ఆచితూచి చిత్రాలను ఎంచుకుంటే ఏదో పుష్కరానికో హిట్ అన్నచందంగా కాకుండా రెగ్యులర్ హిట్స్ ఇచ్చే హీరోగా తయారవుతాడని చెప్పాలి.