ఈ మధ్యకాలంలో మోహన్‌బాబు నటనకు దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. కానీ ఆయన నాటి ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’ నుంచి ‘పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, గాయత్రి’ వంటి పలు చిత్రాలలో నటించాడు. కానీ ఆయన నటించిన ఏ చిత్రం హిట్ కాకపోవడం, ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో జనాలకు తెలియలేదు. ఇక మోహన్‌బాబు 500లకి పైగా చిత్రాలలో నటించాడు. 50 చిత్రాలను నిర్మించాడు. దాసరి, రాఘవేంద్రరావు, కోడిరామకృష్ణ వంటి సుప్రసిద్ధ దర్శకులతో పనిచేశాడు.
ఇక విషయానికి వస్తే ఆయనకు తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చిత్రంలో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఏ నటుడికైనా మణిరత్నం వంటి దర్శకునితో ఓ చిత్రం చేయాలని ఉంటుంది. ఆ కోరిక మోహన్‌బాబుకి తీరిపోనుందని అంటున్నారు. ఇక పాత్రల చిత్రీకరణలో మణిది డిఫరెంట్ స్టైల్. ‘ఓకే బంగారం’ నుంచి ఇటీవల వచ్చిన ‘నవాబ్’ చిత్రంలోని పాత్రలను కూడా మణి అద్భుతంగా మలిచాడు. ఇక మణి ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని రెండేళ్ల నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
మహేష్‌బాబు, విజయ్ వంటి స్టార్స్‌తో మల్టీస్టారర్‌గా రూపొందించాలని మణి కోరిక. కానీ వీలు కాకపోవడంతో ఆయన ఇప్పుడు విక్రమ్-విజయ్ సేతుపతి, జయం రవి వంటివారిని ఎంచుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ‘మహానటి’లో ఎస్వీరంగారావు పాత్ర ద్వారా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించిన మోహన్‌బాబు ఇప్పటికే వందల చిత్రాలు చేసినా.. మణి చిత్రం మాత్రం ఆయనకు ప్రత్యేకమేనని ఒప్పుకోవాలి.