తెలుగులో మంచి కథా రచయితల కొరత ఉందనేది వాస్తవం. దర్శకులందరు తామే కథలను, మాటలను అందిస్తూ టైటిల్ కార్డ్స్ వేసుకుంటూ ఉండటం, రచయితలు దర్శకులుగా మారి బయటి వారికి కథలు ఇవ్వడం మానివేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక సినిమా కథలు అనేది నిజజీవిత సంఘటన ఆధారంగా, రామాయణం, భారతం వంటి పురాణాలు, ఇతిహాసాలలోని సంఘటనలు, పాత్రల స్ఫూర్తితో తయారవుతుంటాయి. ఇక పాత కథలకే కొత్త స్క్రీన్‌ప్లేని జోడించి సినిమాలు తీయడం, పాత చిత్రాలలోని మూలకథను, ఇతర భాషా చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని వస్తున్నాయి.
కానీ ఒకప్పుడు అది వీలైంది గానీ నేడున్న సోషల్‌మీడియా నేపధ్యంలో ఓ చిత్రం చూసిన ప్రేక్షకులే కాదు... టైటిల్, పోస్టర్స్ డిజైనింగ్ నుంచి అది ఏ చిత్రానికి కాపీనో మన నెటిజన్లు ఈజీగా క్యాచ్ చేస్తున్నారు. ‘అజ్ఞాతవాసి, ‘అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి, హలో’ వంటి పలు చిత్రాలను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక విషయానికి వస్తే తాజాగా కళ్యాణ్‌రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌కాన్సెప్ట్‌తో ‘118’ అనే వెరైటీ టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ఇక ఈ చిత్రం చూస్తుంటే ఎప్పుడో 1990ల కాలంలో గీతాకృష్ణ దర్శకత్వంలో సీనియర్ నరేష్, శోభన జంటగా, ఇళయరాజా సంగీతం అందించిన ‘కోకిల’ చిత్రం గుర్తుకు వస్తుంది. ఇందులోని ‘కోకిల..కో..కో..కో..కోకిలా’ అనే పాట ఎవర్‌గ్రీన్, వేరొకరి కళ్లను అమరిస్తే ఆ వ్యక్తికి ఎదురయ్యే కొన్ని విచిత్ర పరిస్థితులతో ఈ చిత్రం సైన్స్‌ఫిక్షన్‌గా రూపొందింది.
ఇక అప్పట్లోనే పెద్ద వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, శరత్‌బాబు, ఊర్వశి వంటి వారు నటించిన ‘చెట్టుకింద ప్లీడర్’ చిత్రం కూడా స్ఫురణకు రాకమానదు. దీనికి కూడా ఇళయరాజానే సంగీతం అందించగా, ‘చల్తీకా నామ్ గాడీ.. చలాకీ వన్నె లేడీ’ అనే పాట ఇప్పటికీ ఫేమసే. అయితే ఈ జనరేషన్‌కి ఈ రెండు చిత్రాల గురించి పెద్దగా తెలియదు కాబట్టి వారు ‘118’ని ఎలా ఆదరిస్తారో వేచిచూడాల్సివుంది..!