తెలుగులోనే కాదు.. దేశ విదేశాలలో కూడా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క వంటి వారు నటించిన ‘బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్’ చిత్రాలు సాధించిన విజయం కనివినీ ఎరుగనిది. ఈ చిత్రంతో ప్రాంతీయ భాషకు చెందిన ఓ చిత్రం బాలీవుడ్ చిత్రాలను కూడా తోసి రాజనన్నది. దక్షిణాది చిత్రాలంటే కేవలం కోలీవుడ్ అనే భ్రమలో ఉన్న అందరినీ ఈ చిత్రం నిబిడాశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం ద్వారా ప్రభాస్ నేషనల్ ఐకాన్‌గా మారిపోయాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే తెలుగు చిత్రాలు అంటే అప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. కానీ నేడు టాలీవుడ్‌కి చెందిన యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ పేరే దేశ విదేశాలలో వినపడుతోంది. టాలీవుడ్ అంటే కేరాఫ్ మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ అంటే టాలీవుడ్ అనే పేరు తెచ్చుకున్న చిరంజీవిని సైతం ప్రభాస్ రేసులో వెనక్కి నెట్టాడు.
చిరంజీవి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా రాని క్రేజ్, ఇమేజ్ ఓ డబ్బింగ్ చిత్రం ద్వారా ప్రభాస్‌కి లభించాయి. దాంతో ఎలాగైనా ‘బాహుబలి’ని మించిన హిట్ కొట్టాలనే కసితో మెగాస్టార్ ఉన్నాడు. ఇప్పటికే పలు భాషలవారు తమ చిత్రం ‘బాహుబలి’ లా ఉంటుందని పోలిక తెచ్చిన ఏ చిత్రం కూడా ఆ చూచాయలకు కూడా రాలేకపోయింది. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి, తన కుమారుడు రామ్‌చరణే నిర్మాతగా కొణిదెల బేనర్‌లో ‘సై..రా..నరసింహారెడ్డి’ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్ ‘బాహుబలి’కి సరిసమానంగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ‘బాహుబలి’ చిత్రాన్ని దాదాపు ఎక్కువగా దక్షిణాదిలోని నటీనటులు, నాజర్, సత్యరాజ్ వంటి వారినే తీసుకున్నారు. కానీ ‘సై..రా..నరసింహారెడ్డి’లో అమితాబ్‌బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి ఎందరో నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని మొదట దసరాకి విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తోన్న మరో భారీ చిత్రం ‘సాహో’ని స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేయనున్నారు. అయితే దసరా కంటే మరింత ముందుగా చిరంజీవి ‘సై...రా’ విడుదల ఉంటుందనే ప్రచార సాగుతోంది. ఏదిఏమైనా ఇటు ‘సాహో’ అటు ‘సై...రా’లలో ఏది ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొడుతుంది? ‘బాహుబలి’ మ్యాజిక్‌ని రిపీట్ చేయడం సాధ్యమేనా? లేక కేవలం ‘నాన్-బాహుబలి’ లెక్కలోకే ఇవి కూడా చేరుతాయా? అనేవి వేచిచూడాల్సివుంది....!