దర్శకులకు మంచి విజన్ ఉండాలి. గతంలో కూడా క్రిష్ కృష్ణం వందే జగద్గురుం కథ రాసుకుని, సినిమా తీసే సమయానికి నిజ జీవితంలో కూడా గాలి జనార్ధన్‌రెడ్డి వంటి వారి అరాచకాలకు అది దర్పణంగా నిలిచింది. ఇక విజన్ విషయంలో క్రియేటివ్ జీనియస్ మణిసార్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తీసే చిత్రాలన్నీ దాదాపు నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందుతాయి. లేదా ఆయన అనుకున్న పాయింట్ సినిమా విడుదలైన తర్వాత జరుగుతూ ఉంటాయి. ‘రోజా, ముంబై, నాయకుడు, దిల్‌సే’ వంటి పలు చిత్రాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇక విషయానికి వస్తే పుల్వామా దాడి నేపధ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల సందర్భంగా భారత్‌కి చెందిన ఐఎఎఫ్ పైలెట్ విక్రమ్ అభినందన్ పాకిస్థాన్ సైన్యానికి చిక్కి నానా హింసలు అనుభవించాడు. తాజాగా ఆయనను పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌కి అప్పగించింది. యుద్ద ఖైదీలను హింసించరాదనే నియమాన్ని పాకిస్థాన్ అతిక్రమించింది. ఆమధ్య మణిరత్నం కార్తి హీరోగా ‘చెలియా’ అనే చిత్రం చేశాడు. అందులో కూడా ఐఏఎఫ్ స్క్వాడన్ లీడర్ అయిన వరుణ్ చక్రవర్తి (కార్తి)నడుపుతున్న విమానాన్ని కార్గిల్ యుద్దం నేపధ్యంలో పాకిస్థాన్ పేల్చివేస్తుంది. అతడిని అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ సైన్యం అతడిని చిత్రహింసలు పాలు చేస్తుంది.
కాగా మణిరత్నం ఈ చిత్రం తీసే ముందు ఐఏఎఫ్‌కి సంబంధించిన వివరాలు, సమాచారం కోసం రిటైర్డ్ ఎయిర్‌మార్షల్ అభినందన్ తండ్రి వర్ధమాన్‌ని కలిసి పలు విషయాలు తెలుసుకున్నాడట. ఇలా ‘చెలియా’లో జరిగిన సంఘటనే ఇప్పుడు తాజాగా పుల్వామా ఘటన నేపధ్యంలో నిజంగా జరగడం యాదృచ్చికమే అయినా అది మణిసార్ విజన్‌కి అద్దం పడుతుందని చెప్పక తప్పదు.