సినిమా వాళ్లకి సెంటిమెంట్స్ బాగా ఎక్కువ. సల్మాన్‌ఖాన్ ప్రతి రంజాన్‌కి ఓ చిత్రం విడుదల చేస్తాడు. అమీర్‌ఖాన్ ప్రతి క్రిస్మస్‌కి ఓ సినిమాని ప్లాన్ చేస్తాడు. తెలుగులో నాగార్జునకి క్రిస్మస్ వచ్చే డిసెంబర్ నెల బాగా అచ్చివస్తుందనే నమ్మకం ఉంది. ఇక విషయానికి వస్తే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుకి ఏప్రిల్ అంటే చాలా ఇష్టం. వేసవి కానుకగా ఆయన నటించిన ‘పోకిరి’తో పాటు ఇండస్ట్రీ హిట్స్ ఆ నెలలోనే వచ్చాయి. అదే మహేష్‌కి మే నెల మాత్రం అచ్చిరాదు. మహేష్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్ అయిన ‘నాని’ చిత్రం మేలోనే విడుదలైంది.
ఇక ఎన్నో అంచనాల మధ్య ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ప్రతిష్టాత్మక బేనర్ అయిన పివిపి నిర్మాణంలో విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం డిజాస్టర్ అయింది. అందుకే మహేష్‌కి మే అంటే ఓ భయం ఏర్పడింది. ‘భరత్ అనే నేను’ చిత్రం షూటింగ్ కూడా ఆలస్యం అవుతూ ఉండటంతో మేలో విడుదల చేయాలని భావించారు. కానీ మహేష్ మాత్రం పట్టుబట్టి రాత్రింబవళ్లు పని చేసి ఏప్రిల్‌లోనే ఈ చిత్రం విడుదలయ్యేలా చేశాడు.
ఇక తాజాగా మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘మహర్షి’ రూపొందుతోంది. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి వంటి భారీ నిర్మాతలు దీనిని నిర్మిస్తుండగా, వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ అది వీలు కాలేదు. చివరకు ఏప్రిల్ 25 అని అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రం విడుదల ఏప్రిల్ 25న కూడా ఉండబోదని, మేలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
దాంతో మండిపడిన మహేష్‌బాబు అనుకున్న విధంగా ఏప్రిల్ 25నే సినిమాని విడుదల చేయాలని, మే నెలలో విడుదల చేయడం వీలుకాదని చెప్పి, నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దాంతో ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కావడం పక్కా అయిపోయింది. దీని వెనక మే అనే భయంకర సెంటిమెంట్ ప్రభావం కూడా మహేష్‌పై పనిచేసిందని అంటున్నారు.