Advertisementt

చిరుకి, పవన్‌కి ఉన్న తేడా ఇదేనంట!

Sat 02nd Mar 2019 03:48 PM
tammareddy bharadwaj,pawan kalyan,chiranjeevi,difference,politics  చిరుకి, పవన్‌కి ఉన్న తేడా ఇదేనంట!
Difference Between Pawan kalyan and Chiranjeevi చిరుకి, పవన్‌కి ఉన్న తేడా ఇదేనంట!
Advertisement

జనసేనాదిపతి పవన్‌కళ్యాణ్‌ దూకుడు పెంచుతున్నాడు. తన జనసేనని తన అన్నయ్య పిఆర్‌పిలా, జయప్రకాష్‌ నారాయణ్‌ లోక్‌సత్తాలా మారనివ్వనని ఘంటాపధంగా చెబుతున్నాడు. నిజానికి ఈ రెండు పార్టీల నుంచి జనసేనాని త్వరగానే అనుభవ పాఠాలు నేర్చుకున్నాడని అర్ధమవుతోంది. మొదట్లో ప్రచారంలో, ప్రసంగాల్లో కాస్త తడబడినా, కేవలం ట్వీట్లవీరుడు అనే విమర్శలు ఎదుర్కొన్నా కూడా ప్రస్తుతం దూకుడు పెంచాడు. వరుసగా అన్ని ప్రాంతాలను చుట్టి పెట్టి వస్తున్నాడు. రాయలసీమని రతనాల సీమగా మారుస్తానని, కర్నూల్‌ని అమరావతికి ధీటుగా అభివృద్ది చేస్తానంటున్నాడు. ఇక మండలానికో ప్రభుత్వ కాలేజీని ఏర్పాటు చేస్తానని, విద్య, వైద్యరంగాలను పటిష్టం చేస్తానని ఆయన చేసిన ప్రకటనలు నిజంగా హర్షించదగినవి. ఇంతకాలం మన నాయకులు వీటిని ప్రైవేట్‌, కార్పొరేట్‌ వారికి దోచి పెట్టారు. ఇలాంటి సమయంలో పవన్‌ వ్యాఖ్యలు కాస్త ఊరటనిచ్చేవే అని చెప్పాలి. 

ఇక తాను పూర్తిగా మెజార్టీ సాధిస్తానో లేదో గానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలలో జనసేన కీలకం అవుతుందని చెప్పాడు. నిజమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపిలో 10 నుంచి 15 సీట్లు వస్తే జనసేన ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కీలకంగా మారుతుంది. ఇక ఎంతో కాలంగా చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల పంథాపై విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఈఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని ఎంతో బాగా చెప్పారు. 

ఆయన మాట్లాడుతూ, పవన్‌కి అశేషమైన జనబలం ఉంది. అందుకే 2014లో పవన్‌ మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ పవన్‌ ఈసారి ఒంటరిగా పోటీలోకి దిగుతున్నారు. సమస్యలపై ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పోరాడుతున్నాడు. కానీ గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో తలెత్తిన లోపాలను జనసేనలో పునరావృతం కాకుండా చూసుకుంటే పవన్‌కి మంచిది. చిరంజీవి మెగాస్టార్‌గా సినీ పరిశ్రమను ఏలాడంటే ఆయన మెతకతనమే దానికి కారణం. ఆయన రాజకీయాలలో ఫెయిల్‌ అయి ఉండవచ్చు. కానీ ఏ విషయంపైన అయినా చిరు అందరితో చర్చించి, అందరి మాటలు సావధానంగా విని, అందరి సలహాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాడు. అదే అతడిని సినీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. కానీ పవన్‌లో మాత్రం ఆ మెతక వైఖరి లేదు. ఆయన మహా మొండి మనిషి. చిన్నప్పటి నుంచి అంతే. మరి రాజకీయాలలో ఈ వైఖరి సరైనదేనా? అన్నదే అనుమానం. 

పవన్‌ రాజకీయాలలో అప్రమత్తంగా ఉండాలి. హోదా సహా అనేక అంశాలపై పోరాటం చేసే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జాగ్రత్తగా ఉండకపోతే జగన్‌, చంద్రబాబుల రాజకీయ ఎత్తుగడలకు బలైపోతాడు. వైజాగ్‌లో హోదా కోసం పోరాడుదామని పిలుపునిస్తే నేను వైజాగ్‌ వెళ్లాను. కానీ పిలుపునిచ్చిన పవనే రాకపోవడం ఏమిటి? పవన్‌ సభలకు జనాలు పోటెత్తుతున్నారు. కానీ ఇంతకంటే ఎక్కువ జనం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వచ్చారు. కానీ వాటన్నింటిని చిరుఓట్లుగా మార్చలేకపోయారు. ఈ విషయంలో పవన్‌ జాగ్రత్త వహించకపోతే జనసేనకి అదే పరిస్థితి వస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ ముక్కుసూటిగా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టాడు. ఇందులో తమ్మారెడ్డి చెప్పిన ప్రతి మాట నిజాయితీగా ఉందనే చెప్పాలి. వాపుని బలుపు అనుకోవడం నేటి రోజుల్లో మూర్ఖత్వమే అవుతుందనేది ఎవరి విషయంలోనైనా నిజమేనని చెప్పాలి. 

Difference Between Pawan kalyan and Chiranjeevi:

Tammareddy Bharadwaj Talks about Pawan kalyan and Chiranjeevi Difference

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement