మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ‘పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం’లతో ఏకంగా 25కోట్ల మార్కెట్‌కి చేరుకున్న ఆయనకి వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్‌లు వచ్చాయి. వాటిలో వినాయక్, కరుణాకరన్ వంటి సుప్రసిద్ద దర్శకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో నమ్మకంతో ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్‌తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఓ నిరుద్యోగ యువకునికి, అతని తండ్రి, ప్రియురాళ్ల మధ్య జరిగే ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. నాపై విమర్శలు చేసిన వారికి మరలా ఈ చిత్రంతో నేను సమాధానం ఇస్తానని సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్ సవాల్ కూడా విసిరాడు. అంతలా తేజు మెచ్చిన చిత్రం కావడం, మరోవైపు అభిరుచి ఉన్న నిర్మాణ సంస్థ అయిన మైత్రిమూవీమేకర్స్ చిత్రం కావడంతో బాగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో సాయికి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే సాయిధరమ్‌తేజ్ వంటి హీరోలతో ముందు ఒక బడ్జెట్‌ని చెప్పి అంతకంటే తక్కువ బడ్జెట్‌తో తీస్తే వారు సహజంగా ఒప్పుకోరు. కానీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం అదే పని చేసిందని సమాచారం. ముందుగా 20కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తామని సాయిధరమ్‌తేజ్‌కి ఆ తర్వాత కేవలం 12కోట్లతోనే సినిమాని ఫినిష్ చేశారని సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం తేజు మార్కెట్‌కి 20కోట్లు అంటే జూదమే అవుతుంది.
ఇక కిషోర్ తిరుమల విషయానికి వస్తే తక్కువ బడ్జెట్‌లో తీసిన ‘నేను..శైలజ’ లాభాలను తెచ్చినా, ఆ తర్వాతి చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’కి మంచి టాక్, ఫీల్‌గుడ్ మూవీగా పేరు వచ్చినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. నేడు ‘పీఎస్వీగరుడ వేగ’ నుంచి ‘కథానాయకుడు, మహానాయకుడు’ వరకు పాజిటివ్ టాక్ వచ్చినా కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలుస్తున్నాయి. దాంతోనే ముందు జాగ్రత్తగా కీలకమైన ఈ నిర్ణయాన్ని మైత్రి సంస్థ తీసుకుందిట. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే మెగామేనల్లుడు మరో సినిమాని లైన్‌లో పెట్టనున్నాడు. మొదట తమిళంలో వచ్చి సూపర్‌హిట్ అయిన ‘రాక్షసన్’ని రీమేక్ చేయాలని భావించాడు. కానీ అది తెలుగు ప్రేక్షకులకు ఎక్కదని పలువురు చెప్పడంతో దానిని వదులుకున్నాడు.
ప్రస్తుతం ఆ చిత్రాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేస్తున్నాడు. మరో వైపు బాలీవుడ్‌లో పెద్ద విజయం సాధించిన ‘గల్లీబోయ్’పై కన్ను పడింది. కానీ అది కూడా సేఫ్ కాదనుకుని తాజాగా ఆయన గీతాఆర్ట్స్2 బేనర్‌లో బన్నీవాసు నిర్మాతగా మారుతి దర్శకత్వంలో చిత్రం చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. మారుతి కిందటి చిత్రం ‘శైలజరెడ్డి అల్లుడు’ సరిగా ఆడలేదు. కానీ యంగ్ హీరోస్‌లో ఆయనకు మినిమం గ్యారంటీ డైరెక్టర్‌గా పేరుంది. అందునా బన్నీవాసు, అల్లుఅరవింద్ వంటి పెద్ద తలలు ఉన్నాయి. ఈ చిత్రం నానికి ‘భలేభలేమగాడివోయ్’ తరహాలో తనకి పెద్దహిట్‌ని అందిస్తుందనే నమ్మకంతో తేజు ఉన్నాడు.