ప్రస్తుతం నందమూరి అభిమానులు చాలా డీలాగా ఉన్నారు. ఎన్నో ఆశలతో వారు నందమూరి అభిమానులు కావడానికి కారకుడైన స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌గా రూపొందిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. యూఎస్‌లో అతి తక్కువ కలెక్షన్లు సాధించిన స్టార్ చిత్రంగా ఇది రికార్డు పుటలకెక్కింది. తన తండ్రికి నివాళిగా తీసిన ఈ చిత్రం.. అందునా తానే నిర్మాతగా మారిన చిత్రం ఇలాంటి ఫలితాన్ని సాధిస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించివుండరు. బాలయ్య కెరీర్‌లోనే ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని అతి పెద్ద డిజాస్టర్ ఇదేనని చెప్పాలి. దీనిని నందమూరి, టిడిపి అభిమానులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అనే విషయం చర్చనీయాంశం అయింది.
చివరకు ఈ చిత్రం కోసం స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు ఫ్రీగా షోలు వేయించే పరిస్థితి రావడం బహు విచిత్రం. తాను నటించిన చిత్రాల కోసం పల్లెటూర్ల నుంచి ఎడ్ల బండ్లులో వచ్చి సినిమాలు చూసే విధంగా చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని ఉచితంగా చూపించాల్సి రావడం కంటే మరో అవమానం ఉండదనే చెప్పాలి. నిజాలకు మసి పూసి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించడం కారణంగానే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదని, రాబోయే కాలంలో మహానుభావుల మీద బయోపిక్ తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయంలో ఈ చిత్రం ఓ గుణపాఠమని చెబుతున్నారు.
ఇక ఇందులో హరికృష్ణ పాత్రను ఆయన కుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ ఉచితంగా చేశాడట. 25రోజులు షూటింగ్ చేసినా తాతయ్య, బాబాయ్, నాన్నల మీద అభిమానంతో కళ్యాణ్‌రామ్ బాలయ్య బలవంతం చేసినా పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక రేపు నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన ‘118’ చిత్రం విడుదల కానుంది. భారీ ఓపెనింగ్స్‌ని ఊహించలేం గానీ కనీసం ట్రైలర్‌తో వచ్చిన పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి లభించి, సినిమా సూపర్‌హిట్ అయితేనే నందమూరి అభిమానులకు మరలా ఊపొస్తుంది.
ఇక ఈ చిత్రం నైజాం, ఆంధ్రా ఏరియాలను దిల్‌రాజు తీసుకోవడం, మొత్తంగా హిందీ డబ్బింగ్, జెమిని శాటిలైట్ వంటివన్నీ కలుపుకుంటే ఈ చిత్రానికి విడుదలకు ముందే 14కోట్లు వచ్చాయట. కళ్యాణ్‌రామ్ ఈ చిత్రం బడ్జెట్ విషయంలో దర్శకనిర్మాతలపై ఒత్తిడి తెచ్చి అతి తక్కువలో అంటే 10కోట్లలో సినిమా తీయించాడని, అందువల్లే ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు నాలుగు కోట్లు లాభం తీసుకొచ్చిందని అంటున్నారు. మరి ఈ జోరుని ‘118’ థియేటర్లలో కూడా చూపిస్తే ‘పటాస్’ తర్వాత మరో హిట్ కళ్యాణ్‌రామ్ ఖాతాలో చేరుతుంది.