టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని, డిఫరెంట్ స్టార్ శర్వానంద్‌లకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమా కథ నుంచి నిర్మాతలు, దర్శకులు, చిత్రంలోని తమ పాత్రలు ఇలా అన్ని ప్రత్యేకంగా ఉంటేనే వీరు సినిమాలకు ఓకే అంటారు. ఇక శర్వానంద్ ఇటీవలే తన 25 చిత్రాలను పూర్తి చేసుకోగా, నాని త్వరలో ఆ ఫీటును సాధించనున్నాడు. ఈ ఇద్దరు మంచి స్నేహితులు, సన్నిహితులు అన్న విషయం తెలిసిందే. ఒకరి సినిమా వేడుకలకు మరోకరు హాజరవుతూ ఉంటారు. ఇంతకాలం వీరిద్దరు తమ చిత్రాలు క్లాష్ కాకుండా చూసుకుంటున్నారు.
కానీ వచ్చే ఆగష్టులో మాత్రం ఇద్దరి మద్య పోటీ తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం నాని మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌లీడర్’ చేయనున్నారు. మరోవైపు శర్వానంద్ సమంతతో కలిసి దిల్‌రాజు బేనర్‌లో తమిళ సూపర్‌హిట్ మూవీ ‘96’ రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఆగష్టుకే షెడ్యూల్ చేసుకున్నాయి. రెండు చిత్రాలు హీరోలు, దర్శకులు, నిర్మాతల పరంగా ప్రెస్టీజియస్ ఫిల్మ్స్‌కావడం విశేషం. మైత్రి మూవీమేకర్స్ ఎలా సినిమాల విడుదల తేదీలో పక్కాగా ఉంటాయో దిల్‌రాజు కూడా అనుకున్న తేదీకి విడుదల చేయడంలో ముందుంటాడు.
ఆగష్టు 15న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ప్రభాస్ ‘సాహో’ విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల తర్వాత నాని, శర్వానంద్‌ల చిత్రాలు ఒకేసారి విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది. ఇక నాని చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కానీ దిల్‌రాజు మాత్రం ‘96’ టైటిల్‌కి బదులుగా మరో ఫీల్‌గుడ్, స్టోరీ ఓరియంటెడ్ టైటిల్ కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. ‘96’ టైటిల్ తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోవచ్చు. అందునా తమిళంలో ఈ మూవీని 1996 నేపధ్యంలో చూపించారు. తెలుగులో అలా చూపించాలంటే శర్వానంద్‌ని మరీ ముసలివాడిగా చూపించాల్సి వస్తుంది.
కాబట్టి ఈ చిత్రం టైటిల్ విషయంలో దిల్‌రాజు ఎంతో తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. ఇక ఆగష్టులోపే నాని నటించిన ‘జెర్సీ’, శర్వానంద్-సుధీర్‌వర్మల చిత్రాలు విడుదలకానుండటం విశేషం. మరి ఈ పోటీలో నాని, శర్వాలలో ఎవరిని విజయం వరిస్తుందో వేచిచూడాల్సివుంది...!