అసలే ‘బాహుబలి’ రేంజ్‌లో తీయాలని మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల బేనర్ అధినేత రామ్‌చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డిలు ఆశపడుతున్న చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. చిరంజీవి 151వ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆలస్యం అయినా సరే అవుట్‌పుట్ విషయంలో రాజీపడటం లేదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోరాట దృశ్యాలను బీదర్‌లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా పొందారు. చిరంజీవితో పాటు యూనిట్ కూడా బీదర్ చేరుకుంది. కానీ అక్కడ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్, వారు సినిమా కోసం వాడే ఆయుధాలను చూసిన స్థానికులు తమ ప్రాంతంలో అలాంటి పోరాట దృశ్యాలను తీసేందుకు వీలు లేదని షూటింగ్‌ని అడ్డుకున్నారు.
ఎంత ప్రయత్నించినా వారు చిత్రీకరణకు ఒప్పుకోలేదు. దాంతో అధికారులు, పోలీసులు కలిసి ‘సైరా..నరసింహారెడ్డి’ యూనిట్‌కి నచ్చజెప్పి షూటింగ్ చేయకుండానే తిరిగి పంపివేశారు. ఈ సీన్స్‌ని కోకాపేటలో వేసిన సెట్స్‌లో తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 25వ చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం చాలా ఆలస్యం అవుతోంది. మొదట ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేస్తామని షూటింగ్ ప్రారంభంలోనే ప్రకటించారు. కానీ ఇది ఏప్రిల్ 25కి వాయిదా పడిందని స్వయంగా దిల్‌రాజు ప్రకటించాడు.
కానీ ‘మహర్షి’ చిత్రం బ్యాలెన్స్ వర్క్ చాలా పెండింగ్‌లో ఉండటంతో ఏప్రిల్ 25న కూడా విడుదలయ్యే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం మహేష్‌బాబు మేకప్‌తో సహా హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నాడు. కానీ పుల్వామా ఘటన నేపథ్యంలో పలు విమానాలను హైజాక్ చేసేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం రావడంతో ఢిల్లీ ఆదేశాల మేరకు విమానాశ్రయ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో వారు మహేష్‌ని కూడా ప్రయాణం చేయడానికి అంగీకరించలేదు.
విమానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపధ్యంలో అధికారుల అనుమతికోసం ఐదు గంటలు విమానాశ్రయంలోని తన వాహనంలో ఎదురు చూసిన మహేష్ చివరకు ఉస్సూరు మంటూ వెనక్కి వెళ్లిపోయాడు. ఇలా మెగాస్టార్, సూపర్‌స్టార్‌లకు సినిమా షూటింగ్ విషయంలో గ్యాప్ వచ్చింది. అసలే ఆలస్యం అవుతున్నాయనే బాధలో ఉన్న వారికి, వారి అభిమానులకు కూడా ఇది తీవ్రనిరాశను మిగిల్చే అంశమేకావడం గమనార్హం.